'ఐపిఎల్ వాయిదా వేయం'
ముంబాయి/న్యూఢిల్లీ: ఎన్నికలు పూర్తయ్యే వరకూ టోర్నమెంట్ వాయిదా వేసుకోండని హోం మంత్రి చిదంబరం ఇచ్చిన సలహా డబ్బుల పంట పండించే ఇండియన్ ప్రీమియం లీగ్(ఐపిఎల్), ప్రభుత్వం మధ్య ఘర్షణకు దారితీసేలా పరిణమించింది. క్రికెట్ క్రేజ్, గ్లామర్ ల మేళవింపు అయిన ఐపిఎల్ పై టెర్రరిజం నీడలు కమ్ముకోవచ్చన్న భయంతో చిదంబరం ముందు జాగ్రత్తగా హెచ్చరిక చేసినప్పటికీ, పోటీల నిర్వాహకులు మాత్రం ఇటు ప్రభుత్వానికి, అటు ప్రేక్షకులకు 'ఏం ఫర్వా లేద'ని నచ్చ చెప్పే ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ యేడాది ఐపిఎల్ సీజన్, ఎన్నికల తొలి దశకు ఆరు రోజుల ముందు, ఏప్రిల్ పదో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల చివరి దశ ముగిసే మర్నాడే, మే 14న పోటీలు పరిసమాప్తమవుతాయి. మొత్తం 59 మ్యాచ్ లు జరుగనున్న ఈ టోర్నమెంట్ ను వాయిదా వేయడం మంచిదని సెక్యూరిటీ ఏజెన్సీలు హోం శాఖకు లిఖితపూర్వకంగా సలహా ఇచ్చాయని చిదంబరం చెప్పారు.
ఎన్నికల నిర్వహణకు తగినన్ని పారా మిలిటరీ దళాలను సమకూర్చడం, అదే సమయంలో క్రికెట్ మ్యాచ్ లకు భద్రతా ఏర్పాట్లు చేయడం చాలా కష్టమని ఆయన స్పష్టం చేశారు. భద్రతా దళాలను అనవసర ప్రయాసకు గురిచేయడం తనకు ఇష్టం లేదన్నారు. అందువల్ల పోటీలకు కొత్త తేదీలు నిర్ణయించడానికి క్రికెట్ అధికారులతో చర్చించ వలసిందిగా హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తాను ఆదేశించారు. అయితే ఐపిఎల్ నిర్వాహకులు మాత్రం తమ పట్టు సడలించడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వ ఒత్తిడిని వారెంత వరకూ తట్టుకో గలరన్నది ఇంకా స్పష్టం కాలేదు. 'భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రాముఖ్యం ఐపిఎల్ నిర్వాహకులకు బాగా తెలుసు. దేశవ్యాప్తంగా మ్యాచ్ లు జరిగే తొమ్మిది పట్టణాల్లో ఎన్నికల పోలింగు తేదీలకు 24 నుంచి 48 గంటల ముందు వరకూ మ్యాచ్ లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం' అని ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి ముంబాయిలో ఒక ప్రకటనలో తెలిపారు.
Pages: 1 -2- -3- News Posted: 4 March, 2009
|