బిసిసిఐ పీఠంపై దాదా కళ్ళు
కోల్ కతా: అంతర్జాతీయ క్రికెట్ నుంచి విశ్రమించిన ఎనిమిది నెలల అనంతరం బెంగాలీ క్రికెట్ దాదా సౌరవ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టాడు. అయితే ఇది సుదీర్ఘమైన ఇన్నింగ్స్ అన్న విషయం గంగూలీకి బాగా తెలుసు. అయిదేళ్ళ తర్వాత భారత క్రికెట్ లో అత్యంత శక్తిమంతమైన, అత్యున్నత పదవిగా పరిగణించే బిసిసిఐ అధ్యక్షుడు కావాలన్నది గంగూలీ లక్ష్యం. ఈరోజు 37వ జన్మదినం జరుపుకుంటున్న గంగూలీకి ఇది కేవలం బర్త్ డే విష్ మాత్రమే కాదు. ఇది ఎవరూ తేలిగ్గా కొట్టిపారేయలేని విషయం. వాస్తవికమైన ఆలోచన కూడా.
2014 నాటికి గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడు కావడానికి పరిస్థితులు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. 2014లో బిసిసిఐకి అధ్యక్ష అభ్యర్ధిని నిలిపే అవకాశం ఈస్ట్ జోన్ కు లభిస్తుంది. అంటే ఈస్ట్ జోన్ నుంచి బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకప్పటి బిసిసిఐ చైర్మన్ జగ్మోహన్ దాల్మియా శకం అక్కడితో ముగియడం దాదాపుగా ఖాయం. అంతమాత్రాన బిసిసిఐ అధ్యక్ష పదవి అంత తేలిగ్గా గంగూలీని వరిస్తుందని కూడా చెప్పలేం. ఇందులో అనేక ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. అయితే ఎన్నో విమర్శలు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ అంతర్జాతీయ క్రికెట్ లో అత్యున్నత స్థాయికి ఎదిగిన గంగూలీకి ఇది పెద్ద సవాలు కాదన్నది అతని అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తున్న వారి వాదన.
Pages: 1 -2- News Posted: 8 July, 2009
|