స్థలం ఆశతోనే వీరూ వలస? న్యూఢిల్లీ : క్రికెటర్ల ఎంపికలో అవినీతి, ఆశ్రితపక్షపాతాలకు పెద్ద పీట వేస్తున్నారని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స కమిటీ పెద్దలపై వీరేంద్ర సెహవాగ్ చేసిన ఆరోపణలు దుమారాన్ని లేపుతున్నాయి. స్టార్ బ్యాట్స్ మన్ గౌతం గంభీర్, బౌలర్లు ఆశిష్ నెహ్రా, ఇషాంత్ శర్మ కూడా వీరూతో గొంతు కలిపారు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే తాము సైతం ఢిల్లీ టీమ్ కు రాంరాం చెప్పడం ఖాయమని మంగళవారం ప్రకటించారు. అయితే హర్యానా ప్రభుత్వం ఇచ్చిన స్థలం కోసమే సెహ్వాగ్ వలస పోవడానికి నిర్ణయించుకున్నాడని, అవినీతి ఆరోపణలు అన్నీ కేవలం సానుభూతిని సంపాదించుకోడానికేనని చెబుతూ ఢిల్లీ క్రికెట్ పెద్దలు ఎదురుదాడికి దిగుతున్నారు.
భుజం గాయంతో బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న సెహ్వాగ్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశాడు. ఇంతకూ ఢిల్లీ ని వదులుతున్నట్లా?లేదా? అన్న ప్రశ్నకు సమాధానంగా `నేను పుట్టి పెరిగింది ఢిల్లీలో. నేనేందుకు ఢిల్లీ క్రికెట్ ను వదిలిపోవాలి' అని ప్రశ్నించి కొద్దిసేపు మౌనం అనంతరం `అయినా తప్పదు' అని సెహ్వాగ్ అన్నాడు. ఢిల్లీ టీమ్ లోని సీనియర్ క్రికెటర్ ఒకరు మాట్లాడుతూ వీరూ చెప్పిందంతా నిజమేనని, ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం పరిస్థితిని చక్కదిద్దే చర్యలు తీసుకోకపోతే తాము ఒకరి తర్వాత ఒకరుగా వెళ్ళడం ఖాయమని అన్నాడు. ఎవరో ఒకరు ఈ దున్న(ఢిల్లీ క్రికెట్ సంఘం) కొమ్ములు వంచి లోంగదీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.
Pages: 1 -2- News Posted: 18 August, 2009
|