పెళ్లికి సిద్ధంగా శ్రీశాంత్ బర్మింగ్ హామ్ : సహచరుడు కొట్టాడని అందరి ముందు వలవలా ఏడ్చేసిన పిల్లాడు గుర్తున్నాడా? ప్రత్యర్ధి ఆటగాళ్ల వైపు నిప్పులు కురిసేలా చూసే తెంపరి... తనను ఎక్కిరించిన బౌలర్ బంతిని ఏకంగా సిక్సర్ కొట్టి చుక్కలు చూపించి పిచ్ మీదే బ్రేక్ డాన్స్ చేసిన తుంటరి... అవునండీ మన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. చిన్నవయస్సులోనే వచ్చిన సెలబ్రిటీ హోదా కిక్కు తలకెక్కి వివాదాల పాలై, ఆ తరువాత గాయాలతో భారత్ జట్టుకు దూరమైన ఈ యువకుడు పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడదామని నిర్ణయించుకున్నాడు. శ్రీశాంత్ కు తగిన వధువును వెదకటంలో అతని తల్లితండ్రులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు తాను చాలా పరిణితి చెందిన మనిషినని శ్రీశాంత్ చెబుతున్నాడు.
ఈ వేసవిలో ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పాడు. బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ మైదానం వెనుక ఉన్న బ్రిటానికి పార్కు లో శ్రీశాంత్ మీడియాతో మాట్లాడాడు. ఇక్కడ ఆట క్రమపద్దతిలో ఉంటుందని, తరువాత జరగబోయే దానిని గురించి ఆలోచించరని చెప్పాడు. ఆ రోజు క్రీడాకారునిగా ఎంతబాగా ఆడామన్నదే ప్రధానంగా భావిస్తారని అన్నాడు. డ్రస్సింగ్ రూంలో ఎంతో మంది స్టార్ ఆటగాళ్ళను కలుసుకునే అవకాశం కౌంటీ క్రికెట్లో లభిస్తుందని వివరించాడు. లెజెండరీ బౌలర్ అలెన్ డొనాల్డ్ కోచ్ గా ఉన్న వార్విక్ షైర్ కు ఆడేందుకు తనకు పిలుపు రావడం జీవితంలో లభించిన అపూర్వమైన అవకాశంగా శ్రీశాంత్ చెప్పాడు. తాను బాల్యం నుంచీ డొనాల్డ్ ను హీరోగా ఆరాధించేవాడినని, ఆహ్వానం అందగానే రెండో ఆలోచనే చేయలేదని, కనీసం కాంట్రాక్ట్ లో ఏముందో కూడా చదవకుండానే సంతకం చేసేశానని అతను వివరించాడు.
Pages: 1 -2- News Posted: 25 August, 2009
|