ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆవిర్భావం నుంచి లీగ్ వ్యవహారాలు చూస్తున్న అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఐఎంజితో కాంట్రాక్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) రద్దు చేసుకోవడానికి అసలు కారణం 2011 సంవత్సరంలో క్రీడాకారుల కోసం సరికొత్తగా వేలంపాట నిర్వహించడంపై నెలకొన్న విభేదాలేనని తెలుస్తున్నది. ఆ వేలం పాట వల్ల మహేంద్ర సింగ్ ధోని వంటి సూపర్ స్టార్లు బిడ్డింగ్ కు అందుబాటులో ఉంటారు.
ఐఎంజికి ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి వత్తాసు ఉంది. మోడి క్రికెట్, రాజకీయ సంస్థల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని బిసిసిఐ వర్గాలు తెలియజేశాయి. 2010 సీజన్ నుంచి ఐఎంజితో తెగతెంపులు చేసుకోవాలని బోర్డు నిశ్చయించింది. మోడి ఎత్తును చిత్తు చేయడానికి శక్తిమంతుడైన బోర్డు కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ వేసిన పైయెత్తే ఈ చర్య అని బిసిసిఐ ఉన్నత స్థాయి ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు యజమాని కూడా. అయితే, ఈ విషయమై వ్యాఖ్యానించడానికి బిసిసిఐ కార్యదర్శి గాని, మోడి గాని అందుబాటులో లేరు. 2011 సంవత్సరానికి కొత్తగా క్రీడాకారుల కోసం వేలంపాట నిర్వహించాలన్న మోడి తాజా ప్రతిపాదనే ఈ వివాదానికి మూల కారణమని ఆ ప్రతినిధి తెలిపారు. ఐపిఎల్ క్రీడాకారులు అందరితో 2008 నుంచి 2010 వరకు మూడు సంవత్సరాల పాటు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు.
'కొత్తగా వేలంపాట నిర్వహించడం వల్ల కొన్ని ఫ్రాంచైజీలు ఇబ్బందులను ఎదుర్కొంటాయి. అవి తమ జట్లను రద్దు చేసుకోవలసి ఉంటుంది. కొందరు క్రీడాకారులను బ్రాండ్ లుగా ప్రచారం చేయడానికి వారిపై పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని అవి కోల్పోవలసి ఉంటుంది. అత్యుత్తమ టి20 క్రికెటర్లు లేని కెకెఆర్ వంటి ఫ్రాంచైజీలు కాకుండా ఇతర ఫ్రాంచైజీలకు లబ్ధి కలగదు. ఇక అందరి కన్నా ఎక్కువగా నష్టపోయేది శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టే' అని బిసిసిఐ ప్రతినిధి వివరించారు.
2008లో అప్పటి రికార్డు స్థాయిలో 1.5 మిలియన్ డాలర్లకు ధోనిని కొనుగోలు చేసిన తరువాత అతనిని కేంద్రంగా చేసుకుని తన బ్రాండ్ ను ప్రచారం చేసుకోవడానికి భారీ మొత్తాలు వెచ్చించిన చెన్నై జట్టు తిరిగి వేలంపాట జరిగిన పక్షంలో తమ అత్యుత్తమ క్రీడాకారుని కోల్పోవచ్చు. భారత జట్టు సారథి ధోనిని పెక్కు జట్లు కోరుకుంటున్నాయి. వాటిలో షారుఖ్ ఖాన్ ఆధ్వర్యంలోని కోలకతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కూడా ఉంది. 'ధోనిని ఎస్ఆర్ కె విపరీతంగా అభిమానిస్తారు. అతనికి దేశవ్యాప్తంగా అధిక సంఖ్యాకంగా అభిమానులు ఉన్నారు. కోలకతా నైట్ రైడర్స్ పేరులో నుంచి కోలకతా పదాన్ని తొలగించాలని షారుఖ్ క్రితం సంవత్సరం నుంచి పట్టుదలగా ఉన్నారు. ఆవిధంగా మేము ఎక్కువ మందికి గాలం వేయవచ్చు' అని షారుఖ్ తో సాన్నిహిత్యం గల ఒక ప్రతినిధి చెప్పారు.
ఎవరైనా క్రీడాకారినితో కాంట్రాక్టు గడువు ముగిసిన తరువాత అతనితో సంప్రదింపులు జరపడానికి తమను ముందు అనుమతించాలని ఫ్రాంచైజీలు ఐపిఎల్ యాజమాన్యానికి సూచించినట్లు బోర్డు ప్రతినిధి తెలియజేశారు. ఐఎంజితో తెగతెంపులు చేసుకుంది ఆ సంస్థ బోర్డు నుంచి అధిక మొత్తం కోరుతున్నందుకే కాదని బిసిసిఐ బాస్ లు చెప్పారు. 'వారు మరీ అతికి పోయి లాభాలలో పది శాతం వాటా అడిగారు. అవసరమైతే బిసిసిఐ లేకుండానే తాము టోర్నమెంట్ ను నిర్వహించగలమని గొప్పలు చెప్పుకుంటున్న ఐపిఎల్ పెద్దలు కొందరు వారికి వత్తాసుగా నిలిచారు' అని బిసిసిఐ ప్రతినిధి చెప్పారు.