ఇశాంత్ పై ధోని ధీమా ముంబై : శ్రీలంకలో ఇటీవల ముక్కోణపు ఒడిఐ సీరీస్ లో ఇతోధికంగా పరుగులు ఇచ్చినందుకు ఇశాంత్ శర్మ కలత చెందవలసిన అవసరం లేదు. అతనికి తన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మద్దతు లభించింది. 'ఫస్ట్ చేంజ్' బౌలర్ నుంచి 'మేలైన' ప్రదర్శనగా దేనిని పరిగణించవచ్చునో చెప్పడం కష్టమని ధోని అన్నాడు. వన్ డే పోటీలలో ఇశాంత్ ను మొదటి చేంజ్ బౌలర్ గానే ఎక్కువగా ఉపయోగిస్తున్న సంగతి విదితమే. ఒక్క ఇశాంత్ కు సంబంధించే కాకుండా ఇతర అంశాలలో కూడా సానుకూల ఫలితాలే వచ్చాయని ధోని భావిస్తున్నాడు.
'మొదటి చేంజ్ బౌలర్ గా బౌల్ చేస్తున్నప్పుడు, కొత్త బంతితో బౌల్ చేస్తున్నప్పుడు పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. ఇశాంత్ మొదటి పవర్ ప్లే సమయంలో రెండు ఓవర్లు వేసి రెండవ పవర్ ప్లే సమయంలో తిరిగి బౌలింగ్ కు వస్తుంటాడు. వన్-చేంజ్ బౌలర్ దుమ్ము దులిపేందుకు ప్రత్యర్థులు సాధారణంగా సిద్ధపడుతుంటారు. వన్-చేంజ్ బౌలర్ పరంగా ఏది మేలైన ప్రదర్శనో చెప్పడం కష్టం. సర్కిల్ లోపల ఫీల్డర్లు ఉన్నప్పుడు నాలుగైదు ఓవర్లు వేసే బౌలర్ వంటివాడు కాడు అతను' అని ధోని వివరించాడు.
మొదటి చేంజ్ బౌలర్ గా వచ్చినప్పుడు ఇశాంత్ బౌలింగ్ సామర్థ్యం పెరిగిందని ధోని చెప్పాడు. 'ఇశాంత్ ఎక్కువగా పూర్తిగా కొత్తదీ కాని, పాతదీ కాని బంతితో బౌల్ చేస్తుంటాడు' అని ధోని చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం దక్షిణాఫ్రికాకు బయలుదేరబోతున్న సందర్భంగా గురువారం ముంబైలో మీడియాతో మాట్లాడినప్పుడు ధోని ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
'కొత్త బంతితో బ్యాట్స్ మన్ ల ముందుకు నేరుగా బౌల్ చేయగలవారు మనకు అవసరం. ఆర్.పి. సింగ్, ఆశిష్ (నెహ్రా) కొత్త బంతితో కాస్త పరుగులు ఇచ్చినా వికెట్లు సంపాదించగల సత్తా ఉన్నవారు. కాని లైట్ల వెలుతురులో కొత్త బంతితో ఇశాంత్ ను ఉపయోగించుకోగలం. ఇశాంత్ కనుక పూర్తిగా కొత్తది కాని బంతితో బౌల్ చేస్తే మొత్తం మీద మన బౌలింగ్ బలం పెరుగుతుంటుంది' అని ధోని పేర్కొన్నాడు. మిడిల్, స్లాగ్ ఓవర్లలో తమ జట్టు బౌలింగ్ మెరుగుపడవలసిన అగత్యం ఉందని కూడా ధోని స్పష్టం చేశాడు.
Pages: 1 -2- News Posted: 18 September, 2009
|