ఇండియాకు వార్మప్ ఓటమి జోహాన్నెస్ బర్గ్ : పోచెఫ్ స్ట్రూమ్ లోని సెన్వెస్ పార్క్ మైదానంలో ఆదివారం ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ వార్మప్ పోటీలో భారత క్రికెట్ జట్టు 103 పరుగుల తేడాతో న్యూజిలాండ్ (కివీస్) జట్టు చేతిలో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా దేశీయ జట్టు వారియర్స్ చేతిలో సంచలనాత్మకంగా ఓడిపోయిన కివీస్ జట్టు తేరుకుని భారత జట్టును చిత్తు చేసింది.
బ్లాక్ క్యాప్స్ జట్టు టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ను ఎంచుకున్న తరువాత 9 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు జెస్సీ రైడర్, మార్టినా గుప్టిల్ తమ జట్టు ఇన్నింగ్స్ కు పటిష్టమైన పునాది ఏర్పరిచారు. రైడర్ 48 బంతులలో 57 పరుగులు, గుప్టిల్ 79 బంతులలో 63 పరుగులు స్కోరు చేశారు. కివీస్ జట్టులో ఆతరువాత నీల్ బ్రూమ్ అద్భుతంగా బ్యాట్ చేసి కేవలం 46 బంతులు ఎదుర్కొని 66 పరుగులు స్కోరు చేశాడు. భారతీయ బౌలర్లలో యూసుఫ్ పఠాన్ ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. అతని 46 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. వాటిలో గుప్టిల్ కీలక వికెట్ కూడా ఉన్నది.
కివీస్ స్కోరుకు సమాధానంగా భారత జట్టులో మొదటి ముగ్గురు బ్యాట్స్ మన్ లు చక్కని ప్రారంభాలే చేశారు కాని వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. అభిషేక్ నయ్యర్ 36 బంతులు ఎదుర్కొని 41 పరుగులు స్ోరు చేశాడు. కాని మిగిలిన బ్యాటింగ్ శ్రేణి కుప్పకూలిపోయింది. భారత జట్టు 41వ ఓవర్ కే 198 పరుగులకు ఆలౌట్ అయింది. బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి, షేన్ బాండ్, జాకబ్ ఓరామ్ తలా రెండు వికెట్లు పతనం గావించారు.
Pages: 1 -2- News Posted: 21 September, 2009
|