డిడి కొత్త సారథి గంభీర్ న్యూఢిల్లీ : టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ (డిడి) జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెల జరిగే చాంపియన్స్ లీగ్ టోర్నీలో డిడి జట్టుకు గౌతమ్ గంభీర్ సారథ్యం వహించనున్నాడు. బ్యాటింగ్ పై దృష్టిని కేంద్రీకరించాలని ఆకాంక్షిస్తున్న సెహ్వాగ్ కెప్టెన్ గా తప్పుకోవాలనే అభిలాషను వ్యక్తం చేశాడు.
'సారథిగా తప్పుకోవాలన్న నా అభ్యర్థనకు అంగీకరించినందుకు జిఎంఆర్ కు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా నేను నా బ్యాటింగ్ పైనే దృష్టి నిలపాలని, జట్టు విజయానికి పాటుపడాలని అభిలషిస్తున్నాను. ఢిల్లీ జట్టుకు, ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాలో ఐపిఎల్-2 టోర్నీలోను కూడా గంభీర్ అద్భుతంగా సారథ్యం వహించాడు. అతను మేటి నాయకుడు కాగల లక్షణాలను ప్రదర్శించాడు. అతను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో నూతనోత్తేజాన్ని పాదుకొల్పగలడు' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఓనర్ జిఎంఆర్ సంస్థ పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించింది. కాని గంభీర్ అత్యంత సమర్థుడైన నాయకుడు కాగలడని సంస్థ భావించింది. దినేష్ కార్తీక్ ను వైస్ కెప్టెన్ గా సంస్థ నియమించింది. 'వీరూ జట్టుకు ఎంతో అండగా, స్ఫూర్తిదాతగా ఉన్నాడు. తన బ్యాటింగ్ పైన దృష్టిని కేంద్రీకరించడానికి నాయకత్వం నుంచి తప్పుకోవాలనే ఆకాంక్షను అతను వ్యక్తం చేసినప్పుడు మేము అతని నిర్ణయాన్ని గౌరవించి అతని అభ్యర్థనకు అంగీకరించాం' అని జిఎంఆర్ స్పోర్ట్స్ చైర్ పర్సన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలియజేశారు.
కాగా, సెహ్వాగ్ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించడం తనకు ఒక సవాల్ కాగలదని గంభీర్ చెప్పాడు. 'ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గా జిఎంఆర్ నన్ను ఎంపిక చేసినందుకు నేను ఆనందించాను. శక్తివంచన లేకుండా జట్టు కోసం నేను ప్రతిభ చూపుతాను. నేను ఎప్పుడూ స్ఫూర్తి కోసం వీరూ వైపు చూస్తుండేవాడిని. అతను నాకు మార్గదర్శి, స్నేహితుడు. అతని వంటి మేటి క్రీడాకారుని స్థానంలో బాధ్యతలు నిర్వర్తించడం ఎప్పుడూ కష్టమే' అని గంభీర్ పేర్కొన్నాడు.
Pages: 1 -2- News Posted: 21 September, 2009
|