తగ్గని ఒడిఐల ప్రాముఖ్యం జోహాన్నెస్ బర్గ్ : పరిమిత (50) ఓవర్ల క్రికెట్ గేములో మార్పులు తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా సూచనలు వస్తున్నాయి. ట్వంటీ20 గేము ఆవిర్భావంతో ఈ 50 ఓవర్ల గేముకు ప్రాముఖ్యం, జనాకర్షణ తగ్గిపోయాయనే వాదన వినిపిస్తున్నది. దీనికి తోడు దాదాపు 17 వేల ఒడిఐ పరుగులు స్కోరు చేసిన సచిన్ టెండూల్కర్ వంటి మేటి క్రికెటర్ే ఈ తరహా క్రికెట్ లో మార్పు ఆవశ్యకమని సూచించడంతో క్రికెట్ ప్రపంచం దీనిపై మరింత దృష్టి నిలుపుతున్నది. ఒక్కొక్కటి 25 ఓవర్లు వంతున నాలుగు ఇన్నింగ్స్ గా 50 ఓవర్ల గేమును విభజించే పద్ధతిలో దక్షిణాఫ్రికా ప్రయోగాత్మకంగా ఆడబోతున్నది.
ఆ వాదన, ప్రయోగాల సంగతి అటుంచితే వన్ డే గేము ప్రాముఖ్యం ఏమీ తగ్గలేదని రుజువు చేయవలసిన బాధ్యత ఆరవ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీపై పడుతున్నది. ఒడిఐలను ఎంతగా కించపరుస్తున్నప్పటికీ వన్డే క్రికెట్ ఇదివరకు ఎన్నడూ లేనంత రసవత్తరంగా సాగబోతున్నది. అగ్ర స్థానానికి మూడు జట్ల మధ్య పోటీ ఉన్నది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇండియా ఆ స్థానం కోసం పోటీ పడుతున్నాయి.
ఇక మెగా స్థాయిలో క్రీడల పోటీలను నిర్వహించడంలో తాము ఎవరికైనా సాటి కాగలమని నిరూపించుకోవాలని ప్రోటియాస్ అనుకుంటున్నారు. ఒక క్రికెట్ జట్టుగా తమను మించినవారు లేరని నిరూపించాలని కూడా వారు ఆకాంక్షిస్తున్నారు. అయితే, దక్షిణాఫ్రికాకు చాంపియన్స్ ట్రోఫీ ఎంత ముఖ్యమైనదైనా ఈ టోర్నమెంట్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న అభిమానుల సంఖ్య తక్కువగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ప్రపంచంలో ఎనిమిది అగ్రశ్రేణి జట్లు ఈ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నప్పటికీ ఈ టోర్నీ కన్నా వచ్చే సంవత్సరం ఈ దేశంలోనే జరగనున్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ టోర్నమెంట్ గురించే జనంలో ఎక్కువగా చర్చ సాగుతున్నది.
గడచిన పది రోజుల వ్యవధిలో ఒడిఐ ర్యాంకింగ్ లలో ప్రథమ స్థానం మూడు సార్లు చేతులు మారింది. పోటీలు నువ్వా నేనా అనే రీతిలో సాగబోతున్నాయనేందుకు ఇది సూచిక కావాలి. 2003 ప్రపంచ కప్, 2007 ప్రపంచ ట్వంటీ20 వంటి ప్రధాన ఐసిసి టోర్నీలను రెండు సార్లు నిర్వహించిన దక్షిణాఫ్రికా ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్నది. దీనిలోనైనా తనకు అదృష్టం కలసి రావాలని దక్షిణాప్రికా ఆశిస్తున్నది. 2003లో ప్రోటియాస్ కెప్టెన్ షాన్ పొల్లాక్, కోచ్ ఎరిక్ సైమన్స్ డక్ వర్త్-లూయిస్ పట్టికను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో ఆ జట్టు టోర్నీలో ప్రథమ దశలోనే తిరుగుముఖం పట్టవలసి వచ్చంది. 2007లో దక్షిణాఫ్రికా పురోగమనం సెమీఫైనల్స్ తోనే ఆగిపోయింది. ఈ దఫా గ్రేమ్ స్మిత్ తమ జట్టు ట్రోఫీని కైవసం చేసుకోగలదని ఆశిస్తున్నాడు. వాస్తవానికి జూన్ లో ప్రపంచ ట్వంటీ20 టోర్నీ తరువాత దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అందువల్ల వారు ఈ టోర్నీలో తమ సత్తా ప్రదర్శించాలని తహతహలాడుతున్నారు.
Pages: 1 -2- News Posted: 22 September, 2009
|