ఇశాంత్ సమస్య ఏమిటి? జోహాన్నెస్ బర్గ్ : భారత మీడియం పేసర్లకు వచ్చిన సమస్య ఏమిటి? వారు ఎన్నో ఆశలు రేపుతూ, వేగంగా బౌల్ చేస్తూ అంతర్జాతీయ పోటీల రంగంలోకి ప్రవేశిస్తారు. కాని రెండు సీజన్ల తరువాత వారిలో వేగం అంతరిస్తుంది. వికెట్లు రావు. వారు రేపిన ఆశలు హఠాత్తుగా హరించుకుపోతాయి. ఇప్పుడు ఇశాంత్ శర్మ పతనాన్ని నిలువరించకపోతే ప్రపంచ క్రికెట్ లో ఇండియా ప్రాబల్యాన్ని ఇది దెబ్బ తీస్తుంది. ఇశాంత్ వంటి సిసలైన ఫాస్ట్ బౌలర్లు ఇండియాకు అరుదుగా లభిస్తుంటారు.
ఇశాంత్ ఒక్కసారిగా చప్పబడ్డాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 18 నెలల క్రితం ఆస్ట్రేలియాలో రిక్కీ పాంటింగ్ ను ఊపిరి తిప్పుకోనివ్వని టీనేజర్ ఇశాంత్ నిలకడగా గంటకు 140 కిలో మీటర్లకు పైగా వేగంతో బౌల్ చేశాడు. ఒక్కొక్కసారి గంటకు 145 కిలో మీటర్ల వేగంతో కూడా బంతులు వేశాడు. కాని ఇప్పుడు అతని వేగం గంటకు 130 కిలో మీటర్లు దాటడం గగనంగా ఉంటున్నది. అతని బౌలింగ్ లో వికెట్లు తీయగల శక్తి కూడా తగ్గినట్లున్నది.
బౌలింగ్ టెక్నిక్ కు సంబంధించిన సమస్య అయితే, అంతగా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఎవరో ఒక కోచ్ త్వరగానే అతనిని తిరిగి గాడిలోకి పెట్టగలరు. అయితే, ఇశాంత్ పని భారాన్ని ఏవిధంగా తట్టుకోగలుగుతున్నాడనేదే ఆందోళన కలిగిస్తున్నది.
Pages: 1 -2- News Posted: 30 September, 2009
|