రియోలో 2016 ఒలింపిక్స్ కోపెన్ హాగన్ : బ్రెజిల్ నగరం రియో డి జనీరో 2016 ఒలింపిక్ క్రీడోత్సవాలకు ఆతిథ్యం ఇస్తుంది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ తో జరిగిన పోటీలో రియోదే పైచేయి అయింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సభ్యులు శుక్రవారం తుది రౌండ్ వోటింగ్ లో రియో నగరానికి తమ సమ్మతి తెలిపారు. 2016 వేసవి ఒలింపిక్ క్రీడోత్సవాల నిర్వహణ కోసం జరిగిన పోటీలో షికాగో ఓడిపోయిందని శుక్రవారం ప్రకటించినప్పుడు ఆ నగర ప్రతినిధులకు ఒక్కసారిగా ఊపిరి బిగపట్టినట్లయింది. వారి కనుల వెంబడి నీరు కారింది. రియో నగరం గురించి ప్రకటన వెలువడిన తరువాత బ్రెజిలియన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కార్లోస్ ఒసొరియో 'రాయిటర్స్' వార్తా సంస్థ విలేఖరితో మాట్లాడుతూ, 'అద్భుతం, ఆనందం పట్టలేకున్నాం. నమ్మలేకున్నాం' అని అన్నారు. బ్రెజిలియన్ బృందం సభ్యులు తమ జాతీయ పతాకాలను ఊపుతూ, పరస్పరం గాఢాలింగనం చేసుకుంటూ, తమ 'మార్వలెస్ సిటీ' గీతాన్ని ఆలపించనారంభించారు.
ఈ ప్రకటన వెలువడడం కొంత ఆలస్యమైనప్పుడు అందరిలోను ఒకవిధమైన ఉత్కంఠ కనిపించింది. ఐఒసి అధ్యక్షుడు జాక్విస్ రోగె కవర్ తెరవడానికి ఇబ్బంది పడ్డారు. ఆయన రియో నగరం పేరును ప్రకటించగానే బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లూలా డా సిల్వా, ఇతర ప్రతినిధులు ఆనందబాష్పాలు వెలువరించారు. 'ప్రతి పోటీలో వలె ఒకే ఒక విజేత ఉంటారు' అని రోగె అన్నారు. '31వ ఒలింపియాడ్ నిర్వహణ బాధ్యతను రియో డి జనీరో నగరానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించే గౌరవం ఈ రాత్రి నాకు లభించింది' అని రోగె చెప్పారు. తుది రౌండ్ వోటింగ్ లో రియోకు అనుకూలంగా 66 వోట్లు, మాడ్రిడ్ నగరానికి అనుకూలంగా 32 వోట్లు పోలయ్యాయి.
రియో బిడ్ నేత కార్లోస్ నుజ్మాన్ తమ దేశాధ్యక్షుడు లూలాను గాఢాలింగనం చేసుకున్నప్పుడు ఇద్దరి కళ్ళలో నుంచి ఆనందబాష్పాలు జాలువారాయి. 'మేము సాధించాం, మేము సాధించాం' అని నుజ్మాన్ అన్నారు. బిడ్ రాయబారి, మాజీ టెన్నిస్ చాంపియన్ గుస్తావో కుయెర్టన్ మాట్లాడుతూ, 'ఇది అద్భుతమైన ఫలితం. దీనిని సాధ్యం చేసేందుకు మేము రేపటి నుంచే పని చేయబోతున్నాం. ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బ్రెజిల్ శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది' అని పేర్కొన్నారు. స్పెయిన్ ప్రధాని జోస్ లూయిస్ రోడ్రిగ్వెజ్ జపారెటో మాట్లాడుతూ, 'రియో గొప్ప అభ్యర్థి. మేము గట్టి పోటీయే ఇచ్చాం' అని అన్నారు.
Pages: 1 -2- News Posted: 3 October, 2009
|