అదరగొట్టిన డుమిని బెంగళూర్: ఛాంపియన్స్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. చివరి వరకు ఉత్కంఠంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఫెవరేట్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్‌కు కేప్ కోబ్రాస్ షాకిచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో భారీ సిక్స్‌లు, ఫోర్లతో బ్యాట్స్‌మెన్ ప్రేక్షకులను కనువిందు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 180 పరుగులు చేసింది. ఆ తర్వాత కేప్‌కోబ్రాస్ మరో మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేధించింది. డుమిని (99 నాటౌట్: 52 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేప్‌కోబ్రాస్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రవీణ్ బౌలింగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న గిబ్స్ ‘డక్’ ఔట్‌గా నిష్ర్కమించాడు. కొద్దిసేపటికే పుతిన్ (11) కూడా వెనుదిరిగాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన డుమిని ఆరంభం నుంచి భారీ షాట్లతో శివమెత్తాడు. డేవిడ్స్(27) సహాయంతో జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న డుమిని, రన్‌రేట్ పెరిగిపోవడంతో భారీ షాట్లకు ప్రయత్నించాడు. అయితే 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు కుంబ్లే క్యాచ్‌ను చేజార్చాడు.
ఈ తర్వాత డుమినికి ఎదురేలేకుండా పోయింది. చివరి రెండు ఓవర్లు ఉన్న తరుణంలో ప్రవీణ్ బౌలింగ్ కేనింగ్ (20) ఔట్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. 9 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా డుమిని వరుసగా రెండు బౌండరీలు కొట్టి మ్యాచ్‌ను కోబ్రాస్ వైపు తిప్పాడు. చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సి ఉండగా లాంగ్‌ఆన్లో భారీ సిక్స్ కొట్టి సింగిల్ తీయడంతో డుమిని 99 పరుగుల వద్ద ఆగిపోవాల్సి వచ్చింది. క్లీన్‌వెల్డ్ బౌండరీ కొట్టి విజయాన్ని ఖరారు చేశాడు.
Pages: 1 -2- News Posted: 9 October, 2009
|