ఆ క్రికెటర్ టెర్రరిస్టు కాదు! జమ్ము: క్రికెట్ కిట్ లో పేలుడు సామాగ్రి లభించిందన్న ఆరోపణపై బెంగళూరు పోలీసులు అదుపులో తీసుకున్న జమ్ము కాశ్మీర్ అండర్ 22 క్రికెట్ టీమ్ సభ్యుడు పర్వేజ్ రసూల్ వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరులో జరిగే సికె నాయుడు ట్రోఫీ టోర్నమెంట్ లో ఆడేందుకు వచ్చిన జమ్మూ జట్టు చిన్నస్వామి స్టేడియంలో బస చేసింది. అదే స్టేడియంలో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ టోర్నమెంట్ భద్రతా చర్యలలో భాగంగా భద్రతా సిబ్బంది పోలీసు జాగిలాలతో స్టేడియం తనిఖీ చేస్తుండగా అవి రసూల్ బస చేసిన రూమ్ వద్దకు చేరుకోవడం, అనంతరం అతని గదిని తనిఖీ చేసిన భద్రతా సిబ్బందికి అతని క్రికెట్ కిట్ బాగ్ లో పేలుడు పదార్ధాల ఆనవాళ్ళు కనిపించాయి. దీంతో రసూల్ తోపాటు అతని జట్టు సహచరుడు, రూమ్ మేట్ మెరాజుద్దీన్ ను పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై జమ్మూ, కాశ్మీర్ లోని రాజకీయ పక్షాలు కళ్ళెర్ర చేశాయి. రసూల్ నిర్బంధాన్ని ఆక్షేపిస్తూ కొన్ని వర్గాలు ఆందోళనకు సిద్దం అవుతున్నాయి.
ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు రసూల్ నిర్బంధంపై అభ్యంతరం లేవనెత్తారు. రసూల్ కు టెర్రరిస్టులతో ఎలాంటి సంబంధాలూ లేవని, అతను ఈ కుట్రలో ఇరుక్కుపోయాడని డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. డాక్టర్ ఫరూక్ జమ్ములో జరిగిన పార్టీ సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, “అతని సంచిలో నుంచి నిషిద్ధ వస్తువులు ఏవీ లభించలేదు. ఆ క్రికెటర్‌కు టెర్రరిస్టులతో ఎటువంటి సంబంధాలూ లేవు. అతనికి జెకెసిఎ క్లీన్ చిట్ ఇచ్చింది’ అని తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 19 October, 2009
|