మళ్లీ నింబస్ కే హక్కులు ముంబై : నియో స్పోర్ట్స్, నియో క్రికెట్ చానెల్స్ నడుపుతున్న నింబస్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 2010, 2014 సంవత్సరాల మధ్య దేశంలో నిర్వహించే అన్ని దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ప్రసార హక్కులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నుంచి తిరిగి సంపాదించింది. బిసిసిఐ మార్కెటింగ్ కమిటీ బుధవారం ముంబైలో జరిపిన సమావేశంలో నింబస్ సంస్థతో ఒప్పందాన్ని రెన్యూ చేయాలని నిర్ణయించింది. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. అత్యంత శక్తిమంతమైన ఈ కమిటీ ఏడాది పైగా విరామం తరువాత జరిపిన తొలి సమావేశం ఇది.
జట్టు స్పాన్సర్ షిప్ కోసం సరికొత్తగా టెండర్లు ఆహ్వానించాలని కూడా కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత స్పాన్సర్ అయిన సహారా సంస్థ తన కాంట్రాక్ట్ ను రెన్యూ చేసుకోవడానికి సుముఖంగా లేదు. ఈ కాంట్రాక్టు 2010 మార్చిలో ముగుస్తుంది.
నింబస్ సంస్థ ఇంతకుముందు కుదుర్చుకున్న కాంట్రాక్ట్ లో తొలి-నిరాకరణ క్లాజు కూడా చేరి ఉన్నది. దీని వల్ల టెండర్ లేకుండానే ఈ ఒప్పందాన్ని రెన్యూ చేయడానికి బిసిసిఐకి వీలు కలిగింది. ఈ కొత్త ఒప్పందం కింద నింబస్ దేశంలో జరిగే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ నూ - టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) లేదా టి20 మ్యాచ్ ను టెలివిజన్ లో ప్రసారం చేయడానికి బిసిసిఐకి రూ. 31.5 కోట్లు చెల్లిస్తుంది. 2006లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బిసిసిఐకి నింబస్ మ్యాచ్ కు రూ. 27 కోట్లు చెల్లిస్తున్నది. అయితే, ఈ ఒప్పందం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు గాని, ప్రపంచ కప్ వంటి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టోర్నీలకు గాని వర్తించదు. ఐపిఎల్ హక్కులు సోనీకి, ఐసిసి టోర్నీల హక్కులు ఇఎస్ పిఎన్-స్టార్ స్పోర్ట్ చానెల్ కు ఉన్న విషయం విదితమే.
2010 నుంచి 2014 వరకు దేశంలో బిసిసిఐ నిర్వహించే అన్ని పోటీలను ప్రసారం చేసినందుకు బోర్డుకు నింబస్ మొత్తం రూ. 2000 కోట్లకు పైగా చెల్లిస్తుంది. నింబస్ సంస్థ 2010 జనవరిలోగా బోర్డు గ్యారంటీ సొమ్ముగా రూ. 660 కోట్లు చెల్లించగలదు.
Pages: 1 -2- News Posted: 22 October, 2009
|