సచిన్ తో ఒక్క రోజు! ముంబై: క్రికెట్ 'లివింగ్ లెజెండ్' సచిన్ టెండూల్కర్ వద్ద క్రికెటింగ్ పాఠాలు నేర్చుకోవడానికి ఒక్క రోజుకు అయ్యే ఖర్చెంతో తెలుసా? అక్షరాలా 12 లక్షల రూపాయలు. సచిన్ కోచ్ గా ఎప్పుడు అవతరించాడా అని ఆశ్చర్యపోవద్దు. సచిన్ ఒక మంచి క్రికెటర్ గానో, లేదా వ్యాపార ప్రకటనలలో నటించడం ద్వారా కోట్లు సంపాదించే స్టార్ క్రికెటర్ గా మాత్రమే మీకు తెలిసి ఉండవచ్చు. కాని, సామాజిక సేవలో సచిన్ పాత్ర గురించి తెలిసిన వారు చాలా అరుదు. చారిటీ నిమిత్తం ప్రతి ఏడాది సచిన్ తన సంపాదన నుంచి కొంత భాగం కేటాయించడంతోపాటు సామాజిక సేవలో నిమగ్నమైన స్వచ్చంధ సంస్థలకు నిధులు సమకూర్చడంలో కూడా తన వంతు పాత్ర నిర్వర్తిస్తుంటారు. ఆ విధంగానే ఈ ఏడాది ఆయన కోచ్ అవతారం ఎత్తాడు.
సచిన్ మద్దతుతో నడిచే అప్నాలయ చారిటీ సంస్థ కోసం ఈ ఏడాది రూపొందించిన ఒక వినూత్న కార్యక్రమం ఏకంగా 12 లక్షల రూపాయల నిధులను సమకూర్చబోతోంది. సచిన్ వద్ద వన్డే ప్రైవేట్ కోచింగ్ కోసం రూపొందించిన ఈ అవకాశాన్ని ప్రముఖ ఆన్ లైన్ ఆక్షన్ పోర్టల్ 'ఈబే ఇండియా'లో వేలానికి పెట్టారు. ఆన్ లైన్ లో ఈ వేలం 12 లక్షల రూపాయల వద్ద ముగిసింది. ఈబే ఇండియాలో ఇంతవరకు జరిగిన ఖరీదైన వేలం ఇదే. మొత్తం 1,024 మంది ఈ ఆన్ లైన్ వేలం పేజీలను సందర్శించగా 99 మంది ఈ అవకాశం కోసం సీరియస్ గా వేలంలో పాల్గొన్నారు. గడువు ముగుస్తున్న చివరి క్షణాలలో బిడ్డర్ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడి వేలం మొత్తం లక్షల రూపాయలకు చేరుకుంది.
Pages: 1 -2- News Posted: 23 October, 2009
|