టాప్ ర్యాంకుపై ఇండియా కన్ను న్యూఢిల్లీ : ఆదివారం వడోదరలో ప్రారంభం కానున్న ఏడు మ్యాచ్ ల ఒడిఐ సీరీస్ లో ఆస్ట్రేలియాతో తలపడినప్పుడు ఇండియా ఐసిసి ఒడిఐ చాంపియన్ షిప్ పట్టికలో అగ్ర స్థానాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ఇదే జరిగితే మూడు నెలలలో మూడవ సారి ఈ టాప్ ర్యాంక్ చేజిక్కుంచుకున్నట్లు అవుతుంది.
రెండవ స్థానంలో ఉన్న ఇండియా ఆగస్టు 11న కొలంబోలో ముక్కోణపు సీరీస్ లో తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ (కివీస్)ను ఓడించిన అనంతరం అగ్ర స్థానాన్ని అధిష్ఠించింది. తరువాత సెప్టెంబర్ 22న దక్షిణాఫ్రికాలోని సెంచురియన్ లో ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ 2009 టోర్నీలో శ్రీలంక చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయిన తరువాత ఇండియా తిరిగి అగ్ర స్థానం అలంకరించింది. కాని ఆ స్థానంలో ఎక్కువ రోజులు గడపకుండానే మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమ్ ఇండియా ఆగస్టు 12న కొలంబోలో శ్రీలంక చేతిలోను, సెప్టెంబర్ 26న సెంచురియన్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో తిరిగి రెండవ స్థానానికి పతనమైంది. అయినప్పటికీ రానున్న సీరీస్ లో ఇండియా 4 -3తో లేదా ఇంకా మెరుగైన తేడాతో ఆస్ట్రేలియాను ఓడించగలిగితే ఐసిసి పట్టికలో తిరిగి ప్రథమ స్థానానికి చేరుకుంటుంది. ఈదఫా ఎక్కువ కాలమే ఆ స్థానంలో ఇండియా కొనసాగవచ్చు.
4-3 ఫలితంతో ఇండియా 127 రేటింగ్ పాయింట్లు పొందుతుంది. ఇది ఆస్ట్రేలియా కన్నా ఒక పాయింట్ ఎక్కువే. 5-2 ఫలితం సాధించినట్లయితే ఇండియా 129 రేటింగ్ పాయింట్లు పొందుతుంది. ఆస్ట్రేలియా స్కోరు 124 పాయింట్లకు తగ్గిపోతుంది. దక్షిణాఫ్రికా కన్నా ఇది కేవలం మూడు పాయింట్లు ఎక్కువ. అదే 6-1తో సీరీస్ గెలుచుకున్నట్లయితే ధోని జట్టు 131 రేటింగ్ పాయింట్లు పొందగలదు. అప్పుడు ఆస్ట్రేలియా కన్నా తొమ్మిది పాయింట్లు అధికంగా సాధించినట్లు కాగలదు. ఇక 7-0తో సీరీస్ ను 'క్లీన్ స్వీప్' చేసినట్లయితే భారత జట్టు రేటింగ్ పాయింట్లు 133కు పెరుగుతాయి. ఆస్ట్రేలియా 120 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పతనమవుతుంది. వాస్తవానికి వడోదర, నాగపూర్ ఒడిఐలను గెలుచుకున్నట్లయితే ఇండియా అక్టోబర్ 28నే ఐసిసి పట్టికలో అగ్ర స్థానానికి పురోగమించగలదు.
Pages: 1 -2- News Posted: 24 October, 2009
|