స్వదేశంలో ఓటముల సెంచరీ వడోదర : ఏడు మ్యాచ్ ల ఒడిఐ సీరీస్ లో భాగంగా ఆదివారం వడోదరలో ఆస్ట్రేలియా చేతిలో ఇండియాకు ఎదురైన ఓటమి స్వదేశంలో నూరవది. అంతే కాదు ఈ నాలుగు పరుగుల ఓటమి కూడా ఆస్ట్రేలియాతో పోటీలో అత్యల్ప తేడాతో సంభవించిన మూడవ ఓటమి. ఇంతకు ముందు రెండు సందర్భాలలో ఇండియా ఒక్క పరుగు తేడాతో ఆసీస్ చేతిలో ఓడిపోయింది.
ఇది ఇలా ఉండగా, మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో టీమ్ ఇండియా సారథి మహేంద్ర సింగ్ ధోని ఈ పరాజయంపై వ్యాఖ్యానిస్తూ, బ్యాటింగ్ పవర్ ప్లే సమయంలో మరీ ఎక్కువగా వికెట్లు కోల్పోవడం సీరీస్ తొలి పోటీలో ఇండియా ఓటమికి కారణమైందని చెప్పాడు.
గెలుపు కోసం 293 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత జట్టు ఒక దశలో మూడు వికెట్ల నష్టానికి 167 స్కోరుతో పటిష్ఠమైన స్థితిలో ఉన్నది. కాని త్వరితగతిని నాలుగు వికెట్లను కోల్పోవడంతో జట్టు ఏడు వికెట్లకు 201 స్కోరుకు పతనమైంది. ఆ దశలో మ్యాచ్ ఇండియా చేజారిపోయిందని ధోని అభిప్రాయం వెలిబుచ్చాడు. 'పవర్ ప్లే సమయంలో మేము మరీ ఎక్కువగా వికెట్లు నష్టపోయాం. అది పోటీని మలుపు తిప్పింది. మేము గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, నాది, రవీంద్ర జడేజా వికెట్లను కోల్పోయాం. జట్టును లక్ష్యానికి బాగా చేరువగా తెచ్చిన ఘనత హర్భజన్ సింగ్, ప్రవీణ్ కుమార్ లకు దక్కుతుంది' అని ధోని పేర్కొన్నాడు.
హర్భజన్, ప్రవీణ్ ధాటీగా బ్యాట్ చేసి ఎనిమిదవ వికెట్ కు 84 పరుగుల భాగస్వామ్యంతో జట్టును లక్ష్యానికి చేరువగా తీసుకువచ్చారు.
Pages: 1 -2- News Posted: 26 October, 2009
|