రెండో వన్డే మనదే నాగపూర్ : రెండో వన్డేలో భారత్ ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 99 పరుగుల భారీ అధిక్యతతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును చిత్తుచిత్తు చేసింది. వడోదరలో ఆదివారం ఎదురైన నాలుగు పరుగుల తేడా ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఏడు వన్డేల సీరిస్ లో 1-1 తో ప్రస్తుతానికి సమవుజ్జీగా నిలచింది. భారతదేశంలో ఆస్ట్రేలియా జట్టు పర్యటలో భాగంగా జరుగుతున్న ఏడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం జరుగుతున్న రెండో వన్డే డే & నైట్ మ్యాచ్ లో ధోనీ ఆసీస్ బౌలర్లకు రేవు పెట్టి ఉతికేశాడు. దాంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 354 పరుగులు చేసి పాత రికార్డులను చెరిపేసింది. పర్వతంలా పేరుకుపోయిన స్కోరును అధిగమించలేక ఆస్ట్రేలియా జట్టు 48.3 ఓవర్లలోనే 255 పరుగులకే చేతులెత్తేసింది.
ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ ఏ దశలోనూ కూడా పోరాట పటిమను ప్రదర్శించలేకపోయింది. పాతిక ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులు మాత్రమే చేసింది. మైకేల్ హస్సీ ఒక్కడే 53 పరుగులు చేయగలిగాడు. ఆదిలోనే భారత్ బౌలర్లు విజృంభించి ఆస్ట్రేలియాను కోలుకోకుండా చేశారు. టాప్ ఆర్డర్ ను ప్రవీణ్ కుమార్(2/37), ఇషాంత్ శర్మ(2/34), హర్భజన్ సింగ్ లు పెవిలియన్ కు పంపిస్తే యువ బౌలర్ రవీంద్ర జడేజా(3/35) మిడిలార్డర్ వెన్ను విరిచాడు.
ఆస్ట్రేలియా జట్టుపై మరే జట్టు కెప్టెన్ సాధించని ఘనతను టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సాధించాడు. 107 బంతులు ఎదుర్కొన్న ధోనీ 124 పరుగులు చేశాడు. ధోనీ మూడు సిక్సర్లు, 9 బౌండరీల సాయంతో ఈ ఘనత సాధించాడు. ధోనీ షాట్లను నిలువరించే ప్రయత్నంలో ఆసీస్ క్రీడాకారులు మైదానంలో పల్టీలు కొడుతూ దొర్లాల్సి వచ్చింది. ధోనీకి తోడుగా క్రీజ్ వద్ద ఉన్న సురేష్ రైనా ముందు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా సింగిల్స్ చేసి దూకుడులో ఉన్న ధోనీకి బ్యాటింగ్ అవకాశం ఇస్తూ వచ్చాడు. ధోనీ సెంచరీ పూర్తయిన అనంతరం రైనా కూడా రెచ్చిపోయి తాను కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.
Pages: 1 -2- News Posted: 28 October, 2009
|