'కోట్లా'(ట)లో భారత్ గెలుపు న్యూఢిల్లీ : ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, నంబర్ టూ యువరాజ్ సింగ్ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై అలవోక విజయం భారత్ సొంతమైంది. స్టార్ క్రికెటర్లతో కిటకిటలాడుతున్న భారత్ జట్టుకు ఆతిధ్య జట్టు 230 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇవ్వగలిగింది. ఆడుతూ, పాడుతూ ఈ స్కోర్ ను భారత్ 48.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఆరు వికెట్ల ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుని భారత్ జట్టు ఏడు మ్యాచ్ ల సీరిస్ లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది. శనివారం నాడు ఇక్కడ ఫిరోషా కోట్లా మైదానంలో డే అండ్ నైట్ మ్యాచ్ గా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
వన్ డౌన్ స్థానంలో బ్యాటింగ్ బరిలో దిగిన మైఖేల్ హస్సే (82 బంతుల్లో 81 పరుగులు నాటౌట్) రాణించడం, ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ కెప్టెన్ రికీపాంటింగ్ 59, షేన్ వాట్సన్ 41 పరుగులతో చక్కని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో ఆస్ట్రేలియా జట్టు టీమిండియాకు 230 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లు నష్టపోయి 229 పరుగులు చేసింది.
ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లుగా వాసికెక్కిన భారత్ స్టార్లకు ఈ స్కోరు తక్కువే అయినప్పటికీ ఓపెనింగ్ జోడీ సెహ్వాగ్-సచిన్ లు ప్రారంభంలో ఒళ్లు దగ్గర పెట్టుకునే ఆడారు. కానీ సెహ్వాగ్ తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరితే సచిన్ 31 పరుగులు చేసి లేని రన్ కోసం ప్రయత్నించి డైరెక్ట్ త్రోకి బలయ్యాడు. ఆతర్వాత రంగంలోకి దిగిన యువరాజ్, ధోని సేన ధనాధన్ లాడించి మ్యాచ్ ను విజయ తీరాలకు చేర్చారు. 78 పరుగులు చేసిన యువరాజ్ చివర్లో వెనుతిరిగినా ధోని 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికై మరో మోటార్ బైక్ ను కైవసం చేసుకున్నాడు. అంతేనా కెప్టెన్ గా ధోనీ మరో ఘనతను కూడా సాధించాడు. ధోనీ నాయకత్వంలో భారత్ ఇప్పటి వరకూ 22 సార్లు ప్రత్యర్ధులు ఇచ్చిన లక్ష్యాలను ఛేదించిన నాయకునిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.
Pages: 1 -2- News Posted: 31 October, 2009
|