హైదరాబాద్ : సచిన్ రమేశ్ టెండూల్కర్...పేరు చెబితేనే ప్రత్యర్ధుల వెన్నులో చలి ఎందుకుపుడుతుందో మరోసారి ప్రపంచం చూసింది. నవంబర్ 5 వ తేదీ సచిన్ క్రీడా జీవితంలో అత్యంత కీలకమైన రోజని అందరికీ తెలిసిందే. ఇరవై సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున సచిన్ భారత క్రికెట్ జట్టులోకి వచ్చాడు. అతని అద్భతమైన అరుదైన బ్యాటింగ్ విన్యాసాన్ని గురువారం నాడు ఉప్పల్ స్టేడియంలోని ప్రతీ ఒక్కరూ కన్నులారా తిలకించి పులకించిపోయారు. వికెట్ల ముందు మేరునగధీరునిలా నిలబడి ఆడిన సచిన్ 175 (141బంతులు)పరుగులను చేసి వన్డేల్లో 45 సెంచరీని నమోదు చేశాడు. భారత్ ను విజయాల అంచులకు ఒంటి చేత్తో తీసుకువెళ్లాడు. అంతేనా 17 వేల పరుగులను వన్డేల్లో పూర్తిచేసిన అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు.
తుది రక్తపు బొట్టు వరకూ పోరాటం అంటే ఎమిటో భారత క్రికెట్ క్రీడాకారులు ప్రపంచానికి చూపించారు. గెలుపు ఓటముల సంగతి అందరూ మర్చిపోయేలా అద్భుతమైన ఆటను ప్రదర్శించి అద్యంతం రక్తి కట్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిర్ధేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా భారత్ బ్యాట్స్ మెన్ లు బరిలోకి దిగారు. కేవలం... కేవలం విజయానికి మూడు పరుగుల దూరంలో దురదృష్టవశాత్తూ ఆగిపోయారు. ఈ విజయంతో ఏడు వన్డేల సీరిస్ లో ఆస్ట్రేలియా 3-2 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆరో వన్డే ఆదివారం నాడు గౌహతిలో జరుగుతుంది.