కళ తప్పిన 'ఈడెన్' కోల్ కతా : కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో సగభాగాన్ని మరమ్మతుల కోసం మూసివేశారు. మిగిలిన సగభాగం గురువారం కళ తప్పి కనిపించింది. ఫ్లడ్ లైట్లు ఆరిపోవడంతో అంధకారం ఆవరించింది. గురువారం సాయంత్రం 5.58 గంటలకు శ్రీలంక ఇన్నింగ్స్ లో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగా, నాలుగు ఫ్లడ్ లైట్ టవర్లలో ఒకటి విఫలమైంది. 2008 ఏప్రిల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ జరుగుతుండగా ఫ్లడ్ లైట్లు ఆరిపోయిన ఉదంతాన్ని ఇది గుర్తుకు తెచ్చింది. 26 నిమిషాల తరువాత లైట్లు తిరిగి వెలిగాయి. కాని అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఒక రాష్ట్రంగా బెంగాల్ ప్రతిష్ఠకు, అంతర్జాతీయ పోటీల వేదికగా ఈడెన్ భవిష్యత్తుకు ఇది విఘాతం కలిగిస్తున్నది. భారత క్రికెట్ అధికారులకు ఇప్పటికే ఈ మైదానంపై అభిమానం హరించుకుపోయింది.
ఫ్లడ్ లైట్ల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేంతవరకు ఈడెన్ మైదానంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్ లను ఇక అనుమతించబోమని పోలీస్ కమిషనర్ గౌతమ్ మోహన్ చక్రవర్తి గురువారం రాత్రి విస్పష్టంగా ప్రకటించారు. 2011 ప్రపంచ కప్ టోర్నీకి ముందు ఈడెన్ మైదానంలో తలపెట్టిన నైట్ గేములు వచ్చే సీజన్ ఐపిఎల్ మ్యాచ్ లే. కాగా, ఈ పరిస్థితికి నెపాన్ని పరస్పరం ఆపాదించుకోవడం అప్పుడే ప్రారంభమైంది. వోల్టేజి మార్పులకు సిఇఎస్ సిదే బాధ్యత అని ఒకరు ఆరోపించగా, టవర్ మెయింటెనెన్స్ లోపానికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సిఎబి)దే బాధ్యత అని మరొకరు పేర్కొన్నారు.
'ఇది బెంగాల్ లో క్రికెట్ కే సిగ్గుచేటు. మరి 15 నెలలలో ప్రపంచ కప్ మ్యాచ్ లకు ఈ స్టేడియం వేదిక కాబోతున్నది. పకడ్బందీగా ఏర్పాట్లు చేయలేమా' అని మైదానంలో ఒక కళాశాల విద్యార్థి అభిరూప్ భట్టాచార్య అన్నాడు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలంటే మందుగా ఈడెన్ మైదానంలో నాలుగు ఫ్లడ్ లైట్ టవర్లను రూ. 4 నుంచి రూ. 6 కోట్ల వరకు వ్యయంతో పూర్తిగా మార్చవలసి ఉంటుంది. అసలు ఈ మైదానం ఒకప్పుడు నగరానికే గర్వకారణంగా ఉండేది. అంతేకాకుండా దేశంలో ఫ్లడ్ లైట్లను అమర్చిన తొలి మైదానం ఇదే.
మైదానంలోని మెటల్ హాలైడ్ బల్బులు స్వల్ప వోల్టేజి మార్పును కూడా తట్టుకోలేవు. ప్రపంచంలోని చాలా వరకు స్టేడియంలు నిరంతర విద్యుత్ సరఫరా (యుపిఎస్) లేదా వోల్టేజి మార్పును తట్టుకునే లైట్లు వంటి అత్యధునాతన టెక్నాలజీని అనుసరిస్తున్నాయి. 'ప్రపంచ కప్ టోర్నీకి ముందు మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయగలమని ఆశిస్తున్నాం' అని సిఎబి అధికారి ఒకరు చెప్పారు. 2008 ఏప్రిల్ లో ఇరకాట స్థితిని ఎదుర్కొన్న అనంతరం సిఎబి, పబ్లిక్ వర్క్స్ శాఖ (పిడబ్ల్యుడి), సిఇఎస్ సి ప్రతినిధులతో ఒక సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు తమ సొంత సంస్థపై నుంచి నెపాన్ని మళ్ళించడానికే ప్రయత్నించారు. 'విద్యుత్ సరఫరాలో అంతరాయం గాని, సమస్య గాని తలెత్తలేదు. వోల్టేజి మార్పు గాని, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం గాని జరిగినట్లయితే నాలుగు ఫ్లడ్ లైట్లు, జయంట్ స్క్రీన్ పని చేయకుండా నిలిచిపోయి ఉండేవి' అని సిఇఎస్ సి అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 25 December, 2009
|