పరువు తీసిన పిచ్చి పిచ్ న్యూఢిల్లీ : ఇది దేశంలో క్రికెట్ క్రీడకు సిగ్గుచేటైన రోజు. ఆటను, అభిమానులను పాలకులు నట్టేట ముంచారు. ఢిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో సిద్ధం చేసిన పిచ్ నాసిగా ఉండడం వల్ల ఆదివారం ఉదయం భారత, శ్రీలంక జట్ల మధ్య ఐదవ వన్ డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) పోటీని ప్రారంభమైన రెండు గంటలకే అర్ధంతరంగా నిలిపివేసి ఆ తరువాత రద్దు చేయవలసి వచ్చింది. ఈ పిచ్ బ్యాటింగ్ కు ప్రమాదకరమైనదని శ్రీలంక బ్యాట్స్ మెన్ ఫిర్యాదు చేయగా అంపైర్లు వారితో ఏకీభవించారు.
మ్యాచ్ నిలిపివేయడంతో క్రీడాకారులు ఫీల్డ్ పై నుంచి నిష్క్రమిస్తుండగా 45 వేల సీట్లు ఉన్న స్టేడియంలో దాదాపు కిక్కిరిసిపోయి ఉన్న వీక్షకులు ఆగ్రహోదగ్రులై స్టాండ్ లలో నుంచి నీటి సీసాలు, కుర్చీలు విసిరివేశారు. ఈ భంగపాటు వల్ల 2011 ప్రపంచ కప్ టోర్నీలో మ్యాచ్ లు వేటికీ ఢిల్లీ వేదిక కాగల అవకాశాలు అంతరించవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిబంధనల ప్రకారం, ఈ మైదానంపై 12 నెలల నుంచి 24 నెలల వరకు నిషేధం విధించవచ్చు.
భారత జట్టు టాస్ గెలిచి, శ్రీలంకను ముందు బ్యాట్ చేయవలసిందని కోరిన అనంతరం ఫాస్ట్ బౌలర్లు వేసిన బంతులు బ్యాట్స్ మెన్ కొందరికి శరీరానికే తగిలాయి. అవి మంచి లెంగ్త్ నుంచి ప్రమాదకర స్థాయిలో పైకి లేచి బ్యాట్స్ మెన్ ను తాకాయి. వికెట్లు కూడా వరుస వరుసగా పతనం కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. 24వ ఓవర్ మధ్యలో మ్యాచ్ ను నిలిపివేసినప్పుడు శ్రీలంక జట్టు ఐదు వికెట్ల నష్టానికి 83 పరుగులు మాత్రమే చేసింది. సుదీప్ త్యాగి గంటకు 135 కిలో మీటర్ల వేగంతో వేసిన ఒక బంతి ఎంత నిటారుగా పైకి లేచిందంటే అది బ్యాట్స్ మన్ కు, వికెట్ కీపర్ కు పైగా వెళ్ళిపోయింది. దీనితో ఈ తిప్పలు చాలని శ్రీలంక జట్టు నిశ్చయించుకుంది. అప్పటికే పెవిలియన్ కు తిరిగి వెళ్ళిన శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర పిచ్ పై ఉన్న తమ బ్యాట్స్ మెన్ తిలిన కండంబి, ముత్తు ముదలిగె పుష్పకుమారలకు సైగ చేశాడు. వారిద్దరూ అంపైర్లకు ఫిర్యాదు చేశారు. అంపైర్లు షావీర్ తారాపూర్, మరైస్ ఎరాస్ముస్ మ్యాచ్ రిఫరీ అలన్ హర్ స్ట్ తో సంప్రతింపులు జరిపి ఆటను నిలిపివేశారు.
Pages: 1 -2- News Posted: 28 December, 2009
|