పాక్ క్రికెటర్ల 'వెల'వెల ముంబయి : ఐపీఎల్-3 టోర్నమెంట్ కు ముంబయిలో మంగళవారం జరిగిన క్రికెటర్ల వేలం పాట అత్యంత ఆసక్తికరంగా సాగింది. క్రికెట్ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ కొన్ని ఫ్రాంఛైజీలు మేటి క్రికెటర్ లను దక్కించుకున్నాయి.ఒకప్పుడు మేటి క్రికెటర్ లుగా వెలిగిన పాక్ ఆటగాళ్లను కొనేవాళ్లు లేక వెలవెలపోవడం ఈ ఐపీఎల్ -3 వేలం ప్రత్యేకత. షాహిద్ అఫ్రిది వంటి అగ్రశ్రేణి ఆటగాడిని కూడా కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ముందుకురాకపోవడం విశేషం. వెస్టీండీస్ కు చెందిన ఆల్ రౌండర్ ఆటగాడు పొలార్డ్ కోసం హోరాహోరీగా వేలం సాగింది.ఈసారి వేలానికి ప్రధానాకర్షణగా నిలిచాడాయన. చివరకు ముంబయి ఇండియన్స్ దక్కించుకోగలిగింది. ఆ ఫ్రాంచైజీ అధినేత నీతూ అంబానీ పొలార్డ్ ను దక్కించుకున్నందుకు ఖుషీగా ఉన్నారు. 7,50,000 డాలర్లు చెల్లించి పొలార్డ్ ను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది.
అలాగే మాజీ ఐపీఎల్ ఆటగాడు షేన్ బాండ్ కోసం హైదరాబాద్ కు చెందిన డెక్కన్ ఛార్జర్స్, కొల్ కతా నైట్ రైడర్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు చెందిన నైట్ రైడర్స్ బాండ్ ను దక్కించుకుంది. దాదాపుగా 3.41 కోట్ల రూపాయలతో బాండ్ ను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన డామైన్ మార్టిన్ ను లక్ష డాలర్లకు, ఆస్ట్రేలియాకు చెందిన అడమ్ వోగ్స్ ను యాభై వేల డాలర్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అలాగే వెస్టీండీస్ కు చెందిన ఫాస్ట్ బౌలర్ కెమార్ రోఖ్ ను హైదరాబాద్ కు చెందిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు సాధించుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ శ్రీలంక ఆటగాడు ధిస్సార పెరెరాను 50, 000 వేల డాలర్లకు బిడ్ దాఖలు చేసి సొంతం చేసుకుంది.
Pages: 1 -2- News Posted: 19 January, 2010
|