షాక్ తిన్న పాక్ క్రికెటర్లు ముంబయి : ప్రపంచ ట్వంటీ20 క్రికెట్ చాంపియన్లు పాక్ క్రికెటర్లు షాక్ తిన్నారు. ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) ఫ్రాంచైజీలు ఎవరూ కూడా వేలంలో తమను మాత్రమే కొనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘోర అవమానంగా భావిస్తున్నారు. వేలం మొత్తానికి పాక్ క్రికెటర్ ఆఫ్రీది సెంట్రల్ ఎట్రాక్షన్ అని అందరూ భావిస్తే ఫ్రాంచైజీలు మాత్రం వారి వంక కన్నెత్తి కూడా చూడలేదు. మొత్తానికి ఐపిఎల్ వేలం వ్యవహారం క్రికెట్ ఆటకే పరిమితమయ్యేటట్లు కనిపించడం లేదు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే దిశగా కదులుతోంది. రెండు దేశాల నడుమ ఉన్న దౌత్య సంబంధాల రూపును నిర్ధేశించవచ్చని పాకిస్తాన్ క్రీడా మంత్రి ఇజాజ్ జక్రానీ స్పష్టం చేశారు.
ఐపిఎల్ వేలం అంతా పాకిస్తాన్ దేశ పరువు ప్రతిష్టలను, పాక్ క్రికెట్ క్రీడాకారులను పరిహసించడానికి, అవమానించడానికీ సాగినట్లు ఉందని పాక్ స్టార్ క్రికెటర్ అఫ్రీదీ వ్యాఖ్యానించారు. వేలంలో ఫ్రాంచైజీల తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నాడు. పాకిస్తానీ ఆటగాళ్ళను అవమానించడానకి భారత ప్రభుత్వం ఐపిఎల్ యాజమాన్యం కలిసి కుట్ర చేసి వేలంలో ఫ్రాంచైజీలు తమ క్రికెటర్లను కొనకుండా చేశాయని పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ఆరోపించారు. పాక్ క్రికెట్ ప్రతిష్టను దిగజార్చడానికి, క్రీడాకారులను అవమానించడానికీ ప్రయత్నించారని ఆయన అన్నారు. క్రీడల్లో రాజకీయాలు ఉండరాదని ఆయన హితవు పలికారు.
కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఇజాజ్ భట్ మాత్రం మరో విధంగా స్పందించారు. ఐపిఎల్ ఫ్రాంచైజీలు తమ క్రికెటర్లను తీసుకోకపోవడం వలన కొత్తగా వచ్చే నష్టం ఎమీ లేదని వ్యాఖ్యానించారు. గత యేడాది పాకిస్తానీ క్రికెటర్లు ఐపిఎల్ మ్యాచ్ లు ఆడలేదు. అలాగే ఈ సంవత్సరం ఆడరు. ఇప్పుడు కొత్తగా వచ్చే తేడా ఏమీ ఉండబోదని, పిసిబి అసలు ఆ వ్యవహారాన్ని పట్టించుకోదని ఆయన చెప్పారు. కాగా ఐపిఎల్ ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయన్న ఉద్దేశంతోనే పాక్ క్రికెటర్ల పేర్లను పంపామని, వారికి అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేశామని మంత్రి జక్రానీ చెబుతున్నారు. దీనిపై పిసిబిని వివరణ అడుగుతామని అన్నారు.
Pages: 1 -2- News Posted: 19 January, 2010
|