కూడబలుక్కునే 'పాడలేదు' న్యూఢిల్లీ : కూడబలుక్కునే చేశారు. అందరూ ఒకే మాటను ముందుగానే అనుకుని, ఏమీ తెలియని నంగనాచుల్లా చాలా నేచురల్ గా నటించి పని కానిచ్చేశారు. అవును ఐపిఎల్ ఫ్రాంచైజీల యజమానులు పాకిస్తాన్ క్రికెటర్లను కావాలనే వేలంలో పాడలేదు. అన్ని దేశాల క్రికెటర్లను పాడిన ఫ్రాంచైజీలు ఒక్క పాకిస్తాన్ క్రికెటర్ నూ అందునా అఫ్రిదీ లాంటి హట్ కేక్ ఫేవరేట్ ను కూడా పక్కన పెట్టడం అనుమానాలకు తావిచ్చింది. ఐపిఎల్ వేలంలో తమ పేర్లను పెట్టి పాడకుండా తమను అవమానించారని, దీనిలో కుట్ర ఉందని పాకిస్తాన్ క్రికెటర్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందన్న విషయం ఇప్పుడు బయటపడింది. ఎవరూ కూడా పాకిస్తాన్ క్రికెటర్ల కోసం బిడ్ దాఖలు చేయకూడదని వేలానికి ముందే ఫ్రాంచైజీ యాజమానులు ఏకాభిప్రాయానికి వచ్చారని తేలింది.
పాకిస్తాన్ ఆటగాళ్ళను అంటరానివారిగా చూడాలని తమ మంత్రిత్వశాఖగాని, ప్రభుత్వం గాని ఐపిఎల్ జట్లకు చెప్పలేదని, ఆ వ్యవహారంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని కేంద్ర క్రీడా మంత్రి ఎంఎస్ గిల్ బుధవారం స్పష్టం చేశారు. అలానే ప్రపంచంలోని మిగతా క్రికెటర్లను చూసినట్లే పాకిస్తాన్ ఆటగాళ్లనూ చూడాలని, వారి కోసం బిడ్ లు దాఖలు చేయాలని భారత క్రికెట్ కంట్రోలు బోర్డు ఐపిఎల్ ఫ్రాంచైజీలకు సలహా ఇచ్చింది. పాకిస్తాన్ క్రికెటర్లు భారత్ వచ్చి ఐపిఎల్ మ్యాచ్ లు ఆడటానికి అవసరమైన వీసాలు, ఇతర అనుమతులు ప్రభుత్వం ఇచ్చేలా తాము చూస్తామని కూడా డిసెంబర్ నెలలో ఫ్రాంచైజీలకు చెప్పింది.
దాంతో పాకిస్తాన్ క్రికెటర్ల విషయంలో తమకు ప్రభుత్వం ఇచ్చే స్పష్టమైన హామీ ఏమిటని ఐపిఎల్ ఫ్రాంచైజీ యజమానులు బిసిసిఐని లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని బిసిసిఐ కేంద్ర ప్రభుత్వంతో చర్చించింది. ప్రభుత్వ అధికారుల సలహాలను సైతం తీసుకుంది. దేశంలో తీవ్రవాదుల దాడుల ప్రమాదం పొంచి ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ఇవ్వజాలదని ఫ్రాంచైజీలకు అంతిమంగా బిసిసిఐ తేల్చి చెప్పింది. ప్రభుత్వ హమీ లేని కారణంగా భవిష్యత్ లో పాకిస్తాన్ క్రికెటర్ల విషయంలో వీసాలు తదితర సమస్యలు తలెత్తుతాయని భావించిన ఫ్రాంచైజీలు చివరకు పాకిస్తాన్ ఆటగాళ్ళను పూర్తిగా విస్మరించడానికే నిర్ణయించుకున్నారు.
Pages: 1 -2- News Posted: 21 January, 2010
|