కైఫ్ కు లైఫ్ దొరికేనా? ముంబయి : గాయాలు పాలై బలహీనమైన భారత టెస్ట్ జట్టు మిడిల్ ఆర్డర్ కు కొత్త రక్తం ఎక్కించేందుకు రంగం సిద్దమవుతోంది.ఊపు మీద ఉన్న సఫారీలతో సీరీస్ సమీపిస్తన్న తరుణంలో మిడిల్ ఆర్డర్ లో సత్తా చాటుతున్న స్టార్ ఆటగాళ్లు గాయాల పాలవడం యువకులకు అవకాశం వచ్చేలా చేసింది. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు ద్రవిడ్, లక్ష్మణ్, యువరాజ్ లు గాయాల కారణంగా బంగ్లా మ్యాచ్ లకు కూడా దూరమయ్యారు. దీంతో బలహీనంగా ఉన్న మిడిల్ ఆర్డర్ ను పరిపుష్టం చేసేందుకు సెలక్షన్ బోర్డు చేపట్టిన పరిశీలనలో మహమ్మద్ కైఫ్ తో పాటుగా మరికొంతమంది రంజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను కైవశం చేసుకొని ఐసిసి ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్న భారత జట్టు స్వదేశీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ లో కూడా విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగించేందుకు వీలుగా కృష్ణామాచారి శ్రీకాంత్ సారథ్యాన జట్టు రూపుదిద్దుకుంటోంది.
ఫిబ్రవరి ఆరో తేదీ నుండి దక్షిణాఫ్రికాతో బారత్ టెస్ట్ పోరు ఆరంభం కానుంది. అత్యంత పటిష్టంగా ఉండాల్సిన మిడిల్ ఆర్డర్ కోసం వన్డే ఆటగాళ్లు సురేష్ రైనా, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, కర్ణాటకకు చెందిన మనీష్ పాండే, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ లు రేస్ లో ముందంజలో ఉన్నారు. యువకులతోనే ఈ స్థానాన్ని భర్తీ చేయాలని బోర్డు వర్గాలు భావిస్తుండటం వీరికి ఛాన్స్ దక్కే అవకాశాలను మెరుగుపరుస్తోంది.తమిళనాడు సౌత్ జోన్ జట్టుకు సారథ్యం వహిస్తున్న రైట్ హ్యాండ్ బ్యాట్స్ మ్యాన్ బద్రీనాథ్ కు టెస్టుల్లో విశేష అనుభవం ఉండటంతో సెలక్టర్ల దృష్టి బద్రీ పైకి మళ్లింది. . అలాగే రైనా, కొహ్లీ, రోహిత్ లు కూడా పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో తమ సత్తాను ఇప్పటికే రుజువు చేసుకోవడంతో సెలెక్టర్లు వీరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Pages: 1 -2- News Posted: 27 January, 2010
|