టెస్ట్ జట్టులో కొత్త రక్తం ముంబాయి : దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో పాల్గొనే భారత క్రికెట్ జట్టులో ఇద్దరు కొత్త కుర్రాళ్ళకు స్థానం కల్పించారు. ఫిబ్రవరి 6న నాగపూర్ లో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ మ్యాచ్ జట్టులో కర్ణాటకకు చెందిన పేస్ బౌలర్ అభిమన్యు మిథున్, బెంగాల్ కు చెందిన వికెట్ కీపర్/బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహలకు కొత్తగా స్థానం కల్పించినట్లు బిసిసిఐ ప్రకటించింది. టీమిండియాలోని కీలక ఆటగాళ్ళు రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్, శ్రీశాంత్ గాయాల బారిన పడి మ్యాచ్ లకు దూరంగా ఉండడంతో కొత్త కుర్రాళ్ళకు అవకాశం కల్పించినట్లు బిసిసిఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తమిళనాడుకు చెందిన మిడిలార్డర్ బ్యాట్స్ మన్ బద్రీనాథ్, ఓపెనర్ మురళీ విజయ్ లు తమ స్థానాలను పదిలపరుచుకున్నారు. బద్రీనాథ్ ను జట్టులోకి పిలిచిన సెలక్షన్ కమిటీ వికెట్ కీపర్ / బ్యాట్స్ మన్ దినేష్ కార్తీక్ ను జట్టుకు దూరంగా ఉంచింది. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సీరీస్ సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన భారతజట్టును బిసిసిఐ గురువారం ఇక్కడ ప్రకటించింది.
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 6వ తేదీన నాగపూర్ లో భారత్ - దక్షిణాప్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా రాహుల్ ద్రావిడ్ ముఖానికి గాయం తగిలింది. దీనితో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఎడమ మణికట్టుకు గాయం అయిన యువరాజ్ సింగ్ ను కూడా టెస్ట్ మ్యాచ్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, హైదరాబాద్ కు చెందిన స్టైలిష్ బ్యాట్స్ మన్ వివిఎస్ లక్ష్మణ్ కూడా బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ సందర్భంగా చేతి వేలికి గాయం తగిలి బాధ పడినప్పటికీ ఇప్పుడు కోలుకోవడంతో జట్టులోకి తీసుకున్నారు. శ్రీశాంత్ కూడా గాయంతో టెస్ట్ కు దూరంగా ఉండడంతో ఉత్తర ప్రదేశ్ కు చెందిన పేస్ బౌలర్ సుదీప్ త్యాగికి జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్ పర్యటన భారత జట్టు తరఫున సుదీప్ త్యాగి కూడా వెళ్ళాడు. బంగ్లా టూర్ వెళ్ళిన భారతజట్టులో రిజర్వ్ ఓపెనర్ గా వెళ్ళిన తమిళనాడు బ్యాట్స్ మన్ మురళీ విజయ్ జట్టులో స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో ఆడే టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో మురళీ విజయం మిడిలార్డర్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pages: 1 -2- News Posted: 28 January, 2010
|