ర్యాంకింగ్ గేమ్ దుబాయ్ : ఐసీసీ టెస్ట్ ర్యాంకుల ప్రకటనకు భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ కీలకంగా మారింది. ఈ సీరీస్ ఫలితాన్నిబట్టి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ నిర్ణయం జరుగుతుంది. ఏప్రిల్ ఒకటో తేదీన ర్యాంకింగ్ లకు కట్ ఆఫ్ డేట్ కావడంతో ఈ సీరీస్ గెలుచుకున్న జట్టు ఐసీసీ ర్యాంకులను ప్రభావం చూపనున్నది. టెస్ట్ ల్లో అగ్రశ్రేణి జట్టుగా భారత్ నిలుస్తుందా..? లేక ద్వితీయ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా టాప్ పొజిషన్ కు వెళుతుందా అన్నది ఈ సిరీస్ లో తేలనుంది. ఈ రెండు జట్లలో ఎవరు అగ్రశ్రేణి జట్టుగా నిలిచినా వారికి ఐసీసీ వార్షిక బహుమతి 1,75,000 డాలర్లను ప్రకటిస్తుంది. అలాగే ద్వితీయ స్థానంలో నిలిచే జట్టు 75,000 డాలర్లను బహుమతిగా దక్కించుకుంటుంది. దీంతో సీరీస్ ప్రారంభానికి ముందే అంకెల గేమ్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ గెలిచినా టీమ్ ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రభాగంలో నిలుస్తుంది. అలాగే సఫారీలు ఒక్క మ్యాచ్ ఓడినా ద్వితీయ స్థానాన్ని ఆస్ట్రేలియన్లకు అప్పగించాల్సి వస్తుంది.
భారత్ జట్టు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాపై నాలుగు రేటింగ్ పాయింట్ లు అధికంగా కలిగి ఉండటం ద్వారా అగ్రస్ధానంలో నిలిచింది. అయితే ప్రత్యర్థి జట్టు 1-0 స్కోరుతో గెలుచుకుంటే భారత్ ద్వితీయ స్థానానికి దిగజారిపోతుంది. భారత్ తన అగ్రస్థానాన్ని నిలుపుకోవాలంటే సీరీస్ ను సమం చేయాల్సి ఉంటుంది. ఐసీసీ ర్యాంకుల నిర్ధారణకు గడువు తేదీ ఏప్రిల్ ఒకటి కన్నా ముందే బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు సీరీస్ లు జరుగుతున్నా, వాటి ప్రభావం భారత్, సఫారీ జట్ల ఐసీసీ ర్యాంకులపై పడే అవకాశం లేదు. ఈ సీరీస్ లో భారత్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో 1-0 స్కోరు తేడాతో ఓడితే, భారత్ కు 123 రేటింగ్ పాయింట్ లు, సఫారీలకు 127 ర్యాంకింగ్ పాయింట్లను ఐసీసీ కేటాయిస్తుంది. ఒకవేళ సఫారీలు భారత్ పై 2-0 స్కోరుతో గెలిస్తే టీమ్ ఇండీయా 120 పాయింట్లకు దిగజారుతుంది. సపారీలు మాత్రం 125 పాయింట్లకు చేరుకుని ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటారు. అదే ఇండియా జట్టు సిరీస్ లో 1-0 గానీ, అంతకంటే ఎక్కువ స్కోరుతో ప్రత్యర్థిపై విజయం సాధిస్తే ద్వితీయ స్థానానికి ఆస్ట్రేలియా చేరుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే ద్వితీయ స్థానానికి ఐసిసి ఇచ్చే 75,000 డాలర్లను ఆ జట్టు ఎగరేసుకుపోతుంది. 1-0 తేడాతో భారత్ ర్యాంకింగ్స్ లో 127 పాయింట్లకు చేరడంతో పాటుగా, సఫారీలను 118 పాయింట్లకు దిగజారుస్తుంది.
Pages: 1 -2- News Posted: 4 February, 2010
|