చాంపియన్స్ లీగ్ ఎక్కడ? ముంబై : లలిత్ మోడి ట్విటర్ పేజి ఇంకా వెల్లడి చేయని విషయం ఇది. చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ 2010 సీజన్ కు మన దేశం నుంచి తరలిపోనున్నది. ఇందుకు అవకాశం, తేదీల నిర్థారణ, సరైన వేదిక కోసం అన్వేషణ గురించి చాంపియన్స్ లీగ్ పాలక మండలి బుధవారం దుబాయిలో సమగ్రంగా చర్చించింది. ఈ టోర్నమెంట్ ను సెప్టెంబర్ 10 నుంచి 26 వరకు నిర్వహించవలసి ఉన్నది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కిక్కిరిసిన భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్ టిపి)లో ఈ టోర్నమెంట్ ను చేర్చేందుకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్నది. కాని ఈ టోర్నీకి వేదికపై తుది నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదు. 'దక్షిణాఫ్రికా, యుకె (ఇంగ్లండ్)లలో ఒకదానికి ఈ అవకాశం దక్కుతుంది' అని ఈ విషయాల గురించి తెలిసిన ఒక ఉన్నత స్థాయి అధికారి గురువారం చెప్పారు.
ఇండియా నుంచి ఈ టోర్నమెంట్ ను తరలించడానికి రెండు కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కారణం వర్షాకాలం కావడం. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ రెండవ వారంలో ప్రారంభం కానున్నందున వర్షాల వల్ల అవరోధం కలగవచ్చు. బిలియన్ డాలర్ల వ్యయమయ్యే ఈ టోర్నమెంట్ లో మ్యాచ్ లు వర్షార్పణం కావడాన్ని ఎవరూ కోరుకోరు. కిక్కిరిసిన ఎఫ్ టిపి కారణంగా ఈ టోర్నీ తేదీలను ఇష్టానుసారం మార్చలేరు. చాంపియన్స్ లీగ్ ను ప్రపంచవ్యాప్త టోర్నమెంట్ గా మార్చాలనే ఆలోచనే రెండవ కారణం. వాస్తవానికి లలిత్ మోడి ఈ టి20 టోర్నీకి నాంది పలికినప్పటి నుంచి స్పష్టం చేస్తున్న అంశం ఇది. 'తేదీల మార్పుల కోసం ప్రయత్నించినప్పుడు ఈ టోర్నమెంట్ ను ఇండియాలో నిర్వహించలేరనేది దృష్టిలో పెట్టుకున్నారు' అని ఆ అధికారి చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సిఇఒ సుందర్ రామన్ మాట్లాడుతూ, 'నిజమే. వేదికల గురించి చర్చ జరిగింది. అయితే, మేము ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోలేదు' అని తెలిపారు.
Pages: 1 -2- News Posted: 12 February, 2010
|