తగ్గిన థాకరే ముంబై : శివసేన అధినేత బాలాసాహెబ్ థాకరే మళ్లీ వెనక్కి తగ్గారు. మహారాష్ట్రలోజరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పోటీలలో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆడకుండా తమ పార్టీ అడ్డుపడబోదని బాల్ థాకరే మంగళవారం ప్రకటించారు. ఆస్ట్రేలియా క్రికెటర్లను ఆడినివ్వబోమని సోమవారం పునరుద్ఘాటించిన బాల్ థాకరే ఆ మర్నాడే మాట మార్చి అందుకు పూర్తిగా భిన్నమైన ప్రకటన చేశారు. శివసేన బెదరింపులను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా ముంబైకర్లు షారుఖ్ ఖాన్ తాజా చిత్రం 'మై నేమ్ ఈజ్ ఖాన్'ను చూసేందుకు వేలాదిగా బారులు తీరిన తరువాత థాకరే ఆస్ట్రేలియన్ క్రికెటర్ల పట్ల తన వైఖరిని మార్చుకున్నట్లున్నది.
'ముంబైలో గాని, మహారాష్ట్రలో గాని ఆడకుండా ఆస్ట్రేలియన్ క్రికెటర్లను నిరోధించడం శివసేన వ్యక్తిగత రాజకీయ అజెండా కాదని బాలాసాహెబ్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాతి వివక్షపూరిత దాడులపై ఎవరో ఒకరు నిరసన వ్యక్తం చేయవలసి ఉంది. దేశం తరఫున శివసేన ఆ పని చేస్తున్నది' అని థాకరే సన్నిహిత సహచరుడు సంజయ్ రౌత్ మంగళవారం చెప్పారు.
'శివసేన ఆందోళన దేని కోసమో జనం అర్థం చేసుకోలేకపోతే ఆస్ట్రేలియన్లను వచ్చి ఆడమనవలసిందని బాలాసాహెబ్ చెప్పారు' అని శివసేన పత్రిక 'సామ్నా' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రౌత్ తెలిపారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై జాతి వివక్షపూరిత దాడులు ఆగనంత వరకు మహారాష్ట్రలోకి ఆస్ట్రేలియన్ క్రికెటర్లను సేన రానివ్వబోదని థాకరే బెదరించిన మరునాడు పార్టీ ఈ ప్రకటన చేసింది.
Pages: 1 -2- News Posted: 17 February, 2010
|