సుభిక్షలో 'మొబైల్' జీతాలు
చెన్నైః సుభిక్ష ద్రవ్య దుర్బిక్షంలో కొట్టు మిట్టాడుతోంది. సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి జారిపోయింది. జీతాలకు బదులు మైబైల్ ఫోన్లను చెల్లిస్తానన్న 'సుభిక్ష'కంపెనీ ప్రతిపాదనను సిబ్బంది తిరస్కరించింది. సుభిక్ష నాలుగు నెలలుగా తన సిబ్బందికి జీతాలను చెల్లించలేదు. జీతాలు చెల్లించమని డిమాండ్ చేసిన సిబ్బందిని పల్లవరంలోని కంపెనీ 'వేర్ హౌస్'కు రావాలని కంపెనీ కోరింది.వేర్ హౌస్ కు వెళ్లిన 50 మంది సిబ్బందికి డబ్బులకు బదులుగ సెల్ ఫోన్ లను జీతాలుగా కంపెనీ యాజమాన్యం ఇవ్వచూపింది.
'ఈ ప్రతిపాదనను కంపెనీ సిబ్బందికంతటికీ తెలియజేయలేదు. మొబైల్ ఫోన్లను జీతాల రూపంలో కంపెనీ అందిస్తోందని తెలుసుకుని ఉద్యోగులు వేర్ హౌస్ వద్దకు వెళ్లారు. అయితే అలా వెళ్లిన వారికి కాలంచెల్లిన, పనికిరాని ఫోన్లను అంటగట్టాలని కంపెనీ చూస్తోంది.ఏవో చిన్న చిన్న లోపాలతో ఉన్న పోన్లను, గొడౌన్ లో మూలన పడేసిన పనిచేయని ఫోన్లను ఇలా సిబ్బందికి అంటగట్టడం దారుణం'అని చెన్నై సుభిక్ష స్టోర్స్ మేనేజర్ అరుణ్ కుమార్ ఆవేదనతో మాట్లాడారు. సుభిక్ష మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సుబ్రమణ్యంను ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా 'కంపెనీలో అలాంటి పరిణామం మాదృష్టికి రాలేదు. అయితే సిబ్బంది జీతాలను వస్తువులతో చెల్లించడంలాంటి పరిష్కారమేదీ జరగలేదు'అని ఆయన తెలిపారు.
సిబ్బంది జీతాల స్థానంలో అందించే హ్యాండ్ సెట్లను కంపెనీ తొలుత కొనుగోలు చేసిన తయారీ ధరకు అంటగట్టే యాజమాన్య ప్రయత్నాలను సిబ్బంది తిప్పికొట్టింది. కంపనీ అధికారులు మొండిగా అదే ప్రతిపాదనపై నిలబడ్డారు. సోమవారంనాడు రోజంతా సిబ్బందికి, యాజమాన్యానికి చర్యలు జరిగినా లాభం లేకుండా పోయింది. ఒక్క చైన్నై సుభిక్ష కంపెనీకి చెందిన 72 మొబైల్ స్టోర్స్ లో 360 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. నాలుగు నెలలుగా చెల్లించని జీతాలకుగాను దాదాపు 1.5 కోట్ల రూపాయలను కంపెనీ చెల్లించవలసి ఉంటుంది. దేశవ్యాప్తంగా సుభిక్షకు 600 మొబైల్ స్టోర్లు, 1,300 గ్రాసెరీ షాపులున్నాయి.
News Posted: 10 February, 2009
|