న్యూఢిల్లీః ఉద్యోగాల ఉద్వాసనకు వ్యతిరేకంగా ప్రభుత్వం పలు ఉద్దీపన చర్యలను చేపట్టనున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి కమల్ నాథ్ మంగళవారంనాడు తెలిపారు. ఫిబ్రవరి 16న మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నసందర్భంలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. కీలక వడ్డీరేట్లు కూడా మరింతగా తగ్గనున్నట్లు ఆయన తెలిపారు.
ఎగుమతి ప్రోత్సాహక గ్రూపుల అంచనా ప్రకారం మార్చ్ చివరనాటికి ప్రపంచ ఆర్దిక సంక్షోభ ప్రతికూల ప్రభావం కారణంగా ఈ రంగంలో దాదాపు కోటి ఉద్యోగాలకు ఉద్వాసన జరుగుతుందని అంచనా. ఈ ప్రతికూల ప్రభావం నుండి దేశ ఆర్ధిక వ్యవస్థను రక్షించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం 2008 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు రెండు ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీలను విడుదల చేసింది. దాంతోపాటుగా ఫ్యాక్టరీ గేట్ సుంకాలను 4 శాతానికి తగ్గించి వేసింది.మందగించిన ఆర్దిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు 200బిలియన్ రూపాయల అదనపు వ్యయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఏడాది 9 శాతంగా ఉన్న ఆర్ధిక ప్రగతి ఈ ఏడాది 7.1 శాతంగా ఉండబోతుందని ప్రభుత్వ గణాంకాలు సోమవారంనాడు తెలిపాయి.