సత్యానికి మరో కొత్త ప్రాజెక్ట్
హైదరాబాద్ః పద్దుల కుంభకోణంలో కూరుకుపోయిన సత్యం కంప్యూటర్స్ సంస్థ క్రమంగా పుంజుకుంటోంది. మాన్యుఫాక్చరింగ్ రంగానికి చెందిన మరో కాంట్రాక్ట్ సత్యం సంస్థకు దక్కింది. అగ్ని ప్రమాదాలను నివారించే సాంకేతిక పరిజ్ఞానాలు,ప్రఖ్యాత అధునాతన బిల్డింగ్ భద్రతా వ్యవస్థల రంగంలో సత్యం సంస్థకు సరికొత్త కాంట్రాక్టు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా సత్యం సంస్థకు 15 కాంట్రాక్టులు లభించిన విషయం తెలిసిందే.ఒప్పందం జరిగిన నాటి నుండి దాదాపు 22 వారాల్లో అమెరికా వ్యాప్తంగా 14 ప్లాంట్లలో పైలట్ ప్రాజెక్టులను పూర్తి చేయవలసి ఉంటుందని కంపెనీకి చెందిన అంతర్గత బులెటిన్ 'న్యూస్ టుడే'లో ఈ కథనం వెలువడింది.
సత్యం కంపెనీ ఖాతాదారుల్లో ఒకరైన ప్రముఖ అమెరికా ఆయిల్ కంపెనీ 'ఒక మోస్తరు రేట్లను పెంచి'సత్యం కంపెనీతో ఒప్పందాన్ని పునరుద్దరించుకోవడమే కాకుండా, సత్యం భవిష్యత్ పై తన విశ్వాసాన్ని ప్రకటించినట్టు 'న్యూస్ టుడే'వెల్లడించింది. రాబోయే రెండు మూడు వారాల్లో కంపెనీ గ్లోబల్ ఖాతాదారులతో ఒకరు తర్వాత ఒకరితో కొత్త చైర్మన్ సంప్రదింపులు జరుతారని కూడా ఆ బులిటెన్ వివరించింది. మెజారిటీ ఖాతాదారులు సత్యం కంప్యూటర్స్ పట్ల విశ్వాసం ప్రకటించారని,ప్రాజెక్టులను సకాలంలో అందించడంలో తేడా వస్తేనే ప్రాజెక్టుల కేటాయింపులపై సమీక్షిస్తామని వారి తెలియజేసినట్లు ఆ బులిటెన్ తెలిపింది.
ఖర్చు తగ్గించుకునే పొదుపు చర్యలను చేపట్టేందుకు నాలుగు టాస్క్ ఫోర్స్ బృందాలను ఇప్పటికే కంపెనీ నియమించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఈ బృందాలు ఖర్చు తగ్గించుకునేందుకు పలు మార్గాలను అన్వేషిస్తున్నాయి. వాటిలో మౌలిక సదుపాయాల ఖర్చులను తగ్గించుకోవడం, బిల్లులేని ప్రయాణాలు,దూర ప్రాంతాల్లో ఉన్న సిబ్బంది ఖర్చులు వగైరా వ్యయాలను ఆదాయాలతో సరిపోల్చి నిర్ణయం తీసుకుంటారు. కంపెనీ పెద్ద ఎత్తున లేఆఫ్ లకు పాల్పడే ఉద్దేశ్యంలో లేదని ఆ నివేదిక పేర్కొంది.
News Posted: 10 February, 2009
|