పసిడి మరింత ప్రియం
ముంబైః బంగారం ధర ఎన్నడూలేనంత అత్యున్నత స్థాయికి చేరింది. పది గ్రాముల బంగారం ధర 14,550 రూపాయలయ్యింది. స్టాక్ మార్కెట్లో ఈ 'యెల్లో మెటల్'షేర్ల కొనుగోలు లావాదేవీలు భారీ స్థాయిలో జరగడం, ఆభరణాల తయారీదారులల కొనుగోళ్లు పెరగడం,ప్రపంచ స్టాక్ మార్కెట్ల ధోరణుల కారణంగా పసిడి ధర మరింతగా పెరిగిపోయింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసేనాటికి బంగారం ధర 310 రూపాయలు పెరుగుదల సాధించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మరింత ఘోరంగా దెబ్బతినబోతోందన్న భయాందోళనలు బంగారం కొనుగోళ్లను ఇబ్బడిముబ్బడిగా పెంచివేశాయి. దాంతో బంగారం ధర ఆకాశానికెగసింది.
న్యూయార్క్ మర్కంటైల్ ఎక్చేంజ్ లో ఔన్స్ బంగారం ధర 892.40 డాలర్ల నుండి 913.70 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ పసిడి మార్కెట్లు మరింత బుల్లిష్ గా మారాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్థ 'పూర్తి స్థాయి సంక్షోభం లకి కూరుకుపోయింది. ప్రజలకు పని కల్పించడంలో ప్రభుత్వ జోక్యం తప్పనిసరి'అని అధ్యక్షుడు ఒబామా ప్రకటించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు మరింత కుదుపుకు లోనయ్యాయి. అదే సమయంలో దేశంలో ముమ్మరంగా సాగుతున్న పెళ్లి సందడి ప్రారంభం కావడంతో ఆభరణాల తయారీ కోసం బంగారం కొనుగోళ్లు పెరిగిపోయాయి.
News Posted: 11 February, 2009
|