సత్యంపై 'అంతిమ తీర్పు'
ముంబైః సత్యం సంస్థ అమ్మకానికి ముస్తాబవుతోంది. పది రోజుల్లో సత్యం కంప్యూటర్స్ గమ్యం, గమనంపై కొత్త బోర్డు నిర్ణయం తీసుకోనుంది. భారత ఐటి దిగ్గజాన్ని పట్టాలెక్కించేందుకు 7-10 రోజుల్లో తుది సమగ్ర ప్రణాలికకు కొత్త బోర్డు శ్రీకారం చుట్టనుందని కంపెనీ చైర్మన్ కిరణ్ కార్నిక్ మీడియా సమావేశంలో తెలిపారు. సత్యం సంస్థను బహిరంగ ప్రకటన లేదా ఆక్షన్ లలో ఏ ప్రక్రియ ద్వారా అమ్మబోతున్నారన్న మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.
సత్యం బోర్డు సమావేశ నిర్వహణ తేదీలు గురువారంనాడు ఖరారవుతాయి. ఆ సమావేశంలో ఖరారయ్యే రోడ్ మ్యాప్ కు ప్రభుత్వ అనుమతి ఉండాలనుకుంటున్నాను.ఖాతాదారులు సత్యం కంపెనీతో తెగదెంపులు చేసుకుంటున్న విషయంపై ప్రశ్నించగా 'గతంలో రెండు కంపెనీలు సత్యంతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. పస్తుతం అలాంటి పరిస్తితి లేదు.'అని కార్నిక్ తెలిపారు. సత్యంను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నసంస్థల గురించి చెప్పేందుకు ఆయన నిరాకరించారు. 'బోర్డు సమావేశం ఆమోదించే రోడ్ మ్యాప్ అన్ని విషయాలను సమగ్రంగా వెల్లడిస్తుంది'అని ఆయన తెలిపారు. సత్యం సంస్థను విడి విడి సంస్థల కింద అమ్మబోతున్నారా అని ప్రశ్నకు సమాధానంగా -'దాని గురించి ఆలోచిస్తున్నాము. విడి సంస్థల్లో లాభదాయకమైనవాటిని మాత్రమే కొనుగోలు చేస్తారు కాబట్టి, సంస్థను మొత్తంగా అమ్మడంపైనే అధిక ప్రాధాన్యతనిస్తున్నాము'అని కార్నిక్ తెలిపారు.
News Posted: 11 February, 2009
|