వడ్డీ తగ్గినా తగ్గని వడ్డింపు
ముంబైః తక్కువ వడ్డీ రేటుతో ఉన్న గృహ రుణాల మార్పిడి విషయంలో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు దొంగ నాటకాలు ఆడుతున్నాయి. బ్యాంకులు కొత్తగా ప్రకటించిన చౌక వడ్డీ రేట్ల పథకానికి మారేందుకు ప్రయత్నించే గృహ రుణ వినియోగదారులను కొన్ని ప్రైవేట్ బ్యాంకులు నానా ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. అలా మారుతున్న వినియోగదారుల నుండి ప్రీపేమెంట్ చార్జీలను వసూలు చేయడమే కాకుండా, వారి ఆస్తుల పత్రాలను సకాలంలో విడుదల చేయకుండా చాలా ఆలస్యం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల వడ్డీరేట్లకు, కొన్ని ప్రైవేట్, విదేశీ బ్యాంకుల వడ్డీరేట్లకు మధ్య 3.5-3.75% దాకా తేడా ఉండడం 'విశేషం'.
ఒక పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు తన వినియోగదారుల నుండి 12-12.5% దాకా వడ్డీని వసూలు చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు 8-9.5% తాజా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. కొత్త వడ్డీరేట్లకు అనూహ్యమైన స్పందన వస్తోందని ప్రభుత్వరంగ బ్యాంక్ అధికారులు తెలియజేశారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కొత్త వడ్డీరేట్ల రుణ మార్పిడి అంత సులభంగా జరగడం లేదు. ప్రైవేట్ బ్యాంకులు మొదటగా 1-1.5% తక్కువ వడ్డీరేటును వినియోగదారులకు అందించేందుకు బేరసారాలను ప్రారంభిస్తాయి. అదే సమయంలో తక్కువ వడ్డీరేట్ల రుణానికి మారేందుకు వినియోగదారులు రీపేమెంట్ చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు గతంలో 1.75-2% గా ఉన్న రీపేమెంట్ చార్జీలను 2.25 శాతానికి పెంచడం మరింత దారుణం.
News Posted: 16 February, 2009
|