20వేల ఇళ్ల వేలం
హైదరాబాద్: గృహ రుణాల బకాయిలను చెల్లించని వినియోగదారులకు చెందిన 20 వేల ఇళ్లను నగరంలో వేలం వేయనున్నారు. జప్తు చేసిన గృహాలను పెద్ద ఎత్తున వేలం వేయడం ఇదే ప్రథమం. ఈ బకాయిదారుల్లో ఎక్కువ మంది ఐటి ఉద్యోగులే కావడం విశేషం. సాప్ట్ పేర్ రంగం ఆర్ధిక మాంద్యంలోకి కూరుకు పోవడంతో ఉద్యోగాలు కోల్పోయిన ఐటి ఉద్యోగులు సులభ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోవడంత వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఎక్కడో అమెరికాలో తలెత్తిన సబ్ ప్రైమ్ సంక్షోభం ప్రపంచ వ్యాప్త మహా సంక్షోభంగా పరిణమించింది. అలాంటి సబ్ ప్రైమ్ క్రైసిస్ తిరిగి జంట నగరాల్లో తలెత్తడం విచారకరం. పలువురు టెక్కీల ఉద్యోగాలు కోల్పోవడం లేదా జీతాల కోతకు సిద్దపడటం జరిగింది. దాంతో వారి ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారింది. పలు రూపాల్లో తీసుకున్న రుణ బకాయిలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది.
టెకీలే కాకుండా పలువురు ఉద్యోగుల పరిస్థితి సైతం ఇందుకు భిన్నంగా లేదు. విమానయాన రంగంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పరిస్థితి కూడా ఘోరంగా మారింది. ఐటి ఉద్యోగుల్లా వారు కూడా సులభ వాయిదాలను కట్టలేని పరిస్థితి దాపురించింది. ఆస్తుల్ని జప్తు చేసి వేలం వేస్తామని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు నోటీసులిచ్చినప్పటికీ టెక్కీలు డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. వాస్తవంలో, వారు డబ్బును సమీకరించలేని పరిస్థితిలో ఉండడం వల్ల వారు వేలాన్ని అంగీకరిస్తున్నారు.
ఇళ్ల నిర్మాణంలో తాము 20 శాతం ఖర్చును భరించినప్పటికి వినియోగదారులు వేలానికి సిద్ధపడిపోతున్నారు. 80 శాతం రుణం అందించిన బ్యాంకులకు ఇళ్లను జప్తు చేసి వేలం వేసినప్పటికీ అమ్ముడవుతాయన్న ఆశలు లేవు. 'జప్తు చేసిన ఇళ్లను అమ్మివేయడం మినహా బ్యాంకులకు మరో ప్రత్యామ్నాయమే లేదు. బకాయిలు చెల్లించని గృహ రుణగ్రస్తులు చాలా మందికి ఇంకా నోటీసులు త్వరలో నోటీసులు జారీ అవతాయి. రాబోయే కొద్ది మాసాల్లో మరిన్ని వేలంపాటలు జరుగనున్నాయి ' అని ఐడిబిఐ డైరెక్టర్ కె. క్రిష్ణ మూర్తి తెలిపారు.
News Posted: 17 February, 2009
|