సత్యం కేసుకు 'టైమ్ ఫ్రేమ్'
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసు దర్యాప్తుపై కాలపరిమతిని ప్రకటించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారంనాడు సిబిఐని కోరింది. సత్యం కేసును సిబిఐకి అప్పగించాలని, కేసు దర్యాప్తుకు ఒక టైమ్ ఫ్రేమ్ ను రూపొందించాలని కేరళ స్టాక్ ఇన్వెస్టర్స్ హబ్ అన్న ఇన్వెస్టర్ కమ్యూనిటీకి చెందిన అచ్యుతన్ ఫిబ్రవరి 12న హై కోర్టులో పిటిషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ కోర్టు మొదటగా ఫిబ్రవరి 16న విచారిస్తూ ప్రస్తుత తాజా పరిస్థితిని తెలియజేయాలని కోరింది. వివరాలతో కూడిన అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించేందుకు ఫిబ్రవరి 26 దాకా గడువు కావాలని కోర్టును సిబిఐ కోరింది.
సత్యం కేసు దర్యాప్తు నిమిత్తం మౌలిక సదుపాయాలు గల గెస్టు హౌస్ అంటే ఒక ఆఫీసు, ఆరు ల్యాప్ టాప్ లు, ఒక ప్లాటూన్ సాయుధ బలగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని సిబిఐ కోరినట్లు సిబిఐ న్యాయవాది కోర్టుకు తెలియజేసారు. ఈ మౌలిక సదుపాయులున్నట్లయితే సిబిఐ ఒక రోజు లోపే దర్యాప్తును ప్రారంభించగలదని ఆయన తెలిపారు. సిబిఐ కోరిన మౌలిక సదుపాయలను ప్రభుత్వం త్వరలో కల్పించనుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమాధానం తెలిపారు.
రాష్ట్ర సిఐడి పోలీసులు దాదాపు 200 ట్రంకు పెట్టెల నిండుగా సత్యం కంప్యూటర్స డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్లను భద్ర పరచేందుకు అనువైన స్థలాన్ని చూపించవలసిందిగా ప్రభుత్వాన్ని సిబిఐ కోరింది.ఆర్ బిఐ, సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇన్ కమ్ టాక్స్, సిబిఐలకు చెందిన 15-20 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాపతు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సిబిఐ కౌన్సెల్ తెలిపారు.
News Posted: 19 February, 2009
|