సత్యం సేల్ కు గ్రీన్ లైట్
న్యూఢిల్లీ: సత్యం కంపెనీ అమ్మకానికి మార్గం సుగమమైంది. కంపెనీ అమ్మకంలో మొదటి అడుగు అయన ఒక వ్యూహాత్మక ఇన్వెస్టర్ ను సత్యం సంస్థలో స్థానం కల్పంచే బోర్డ్ ప్రతిపాదనను కంపెనీ లా బోర్డు (సిఎల్ బి) గురువారంనాడు అనుమతించింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్ కు స్థానం కల్పించేందుకు గాను కంపెనీ అధికారిక వాటాను పెంచుకునే హక్కును కల్పించాలన్న బోర్డు ప్రతిపాదనను కంపెనీ లా బోర్డు అంగీకరించింది. అయితే వ్యూహాత్మక ఇన్వెస్టర్ ను బహిరంగ వేలంపాట ద్వారా ఎంపిక చేసుకోవాలని సిఎల్ బి సూచించింది. అదే సమయంలో కంపెనీ ప్రిఫరెన్షియల్ షేర్లను మార్కెట్ ధరకుగాని, ప్రారంభ ధరకు గాని విడుదల చేసుకునేందుకు సత్యం బోర్డుకు సిఎల్ బి అనుమతి ఇచ్చింది. సత్యం కంప్యూటర్స్ కు చెందిన 26 శాతం వాటాను వ్యూహాత్మక ఇన్వెస్టర్ కు అమ్మివేసేందుకు సత్యం బోర్డు సిద్దమవుతోంది.
దీర్ఘకాలిక నిధుల సేకరణ కోసం ఒక వ్యూహాత్మక ఇన్వెస్టర్ అవసరముంటుంది. కంపెనీ ప్రయోజనాల కోసం, కంపెనీ ఉద్యోగుల, షేర్ హోల్డర్ల, వినియోగదారుల, విశాలమైన ప్రజల ప్రయోజనాల కోసం ఒక వ్యూహాత్మక ఇన్వెస్టర్ సత్యం కంప్యూటర్స్ కు అత్యవసరమని సిఎల్ బి చైర్మన్ ఎస్ సుబ్రమణ్యం తెలిపారు. కంపెనీ అమ్మకాన్ని సులభతరం చేయడం కోసం బహిరంగ వేలం ద్వారా వ్యూహాత్మక ఇన్వెస్టర్ ను ఎంపిక చేసే ప్రతిపాదనను బుధవారంనాడు సిఎల్ బి అనుమతి కోసం సత్యం బోర్డు కోరిన విషయం తెలిసిందే. సత్యం కంపెనీకి అత్యవసరంగా వర్కింగ్ కేపిటల్ కావాలని బోర్డు తెలిపింది. దాంతోపాటు సత్యం ఆర్ధిక సమస్యలు, సంస్థాగత సమస్యలు పరిష్కరించకుంటే కంపెనీ నుండి తప్పుకుంటామని సత్యం సిబ్బంది, ఖాతాదారులు బెదిరిస్తున్నట్లు సిఎల్ బికి సత్యం వివరించింది. సత్యం కంపెనీని కొనుగోలుకు ఎల్అండ్ టి, బికె మోడి గ్రూప్, హిందాజా సంస్థలు పోటీపడుతున్న విషయం తెలిసిందే.
News Posted: 19 February, 2009
|