రాజు & కోపై సిబిఐ కేసు
న్యూఢిల్లీ: సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు, అతని సోదరుడు రామరాజు తదితరులపై సిబిఐ శుక్రవారంనాడు కేసులు నమోదు చేసింది. సత్యం కంప్యూటర్స్ సంస్థలో 7,800 కోట్ల రూపాయల పద్దుల కుంభకోణానికి పాల్పడ్డ సత్యం రామలింగరాజు కేసు దర్యాప్తు కోసం 16 మందితో కూడిన దర్యాప్తు కమిటీని సిబిఐ ఏర్పాటు చేసింది. దేశంలో మునుపెన్నడూ లేనట్టి 'అరుదైన' కేసుగా ఈ పద్దుల కుంభకోణం నిలుస్తుందని సిబిఐ అధికారులు వ్యాఖ్యానించారు. రాజు, అతని డైరెక్టర్లు, ఆడిటర్లపై భారత శిక్షాస్మృతి ప్రకారం ఫోర్జెరీ, ఘరానా మోసాల సెక్షన్ల కింద కేసులన్ని నమోదు చేసినట్లు సిబిఐ ప్రకటించింది.
సత్యం కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎమ్ డిఐటి)ను సిబిఐ ఏర్పాటు చేసింది. ఈ టీమ్ కు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ వివి లక్ష్మి నారాయణ సారధ్యం వహిస్తారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ దర్యాప్తు కేంద్రంగా ఈ దర్యాప్తు కొనసాగనున్నట్లు సిబిఐ తెలిపింది. రాజు & కోపై ఐపిసి సెక్షన్ 120-బి (నేరపూరితమైన కుట్ర), 409 (నమ్మక ద్రోహం), 420 (ఘరానా మోసం), 467, 468 (ఫోర్జరి), 471 (ఫోర్జరీ డాక్యుమెంట్లను నిజమైనవిగా నమ్మించడం), 477-ఏ (అకౌంట్లను తారుమారు చేయడం) తదితర కేసులను సిబిఐ పెట్టినట్లు ప్రకటించింది. హైదరాబాద్ సిబిఐ ఎస్ పి ఈ కేసులో ప్రదాన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పనిచేస్తారు. ఈ అధికారులతోపాటు ఎమ్ డిఐటిలో ఒక ఎస్ పి, బ్యాంక్ సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్ సెల్ (బిఎస్ఎఫ్ సి), 11 మంది సిబిఐ అదికారులు ఈ బృందంలో ఉన్నారు. వీరితోపాటు ఎస్ బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కూడా సిబిఐ టెక్నికల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని సిబిఐ అధికార ప్రతినిధి తెలిపారు.
News Posted: 20 February, 2009
|