'సిటీ'ని మించిన స్టేట్ బ్యాంక్
ముంబై: మారిన ప్రపంచ ఆర్దిక చిత్రపటంలో భారత్ దేశపు హవా సాగుతోంది. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంపద ప్రపంచ ప్రసిద్ది సిటీ బ్యాంకు సంపదను మించి పోయింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టేట్ బ్యాంక్ మార్కెట్ కేపిటలైజేషన్ 66,285 కోట్లకు చేరింది. అదే సమయంలో న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ వద్ద సిటీ గ్రూప్ మార్కెట్ కేపిటలైజేషన్ 25 శాతం పతనమై 52,931 కోట్లకు చేరింది.
సిటీ గ్రూప్ స్టాక్ శుక్రవారంనాడు 22.3 శాతం పతనమై, 1.95 డాలర్లకు (దాదాపు 97 రూపాయలకు) చేరుకుంది. అమెరికా ప్రభుత్వం సిటీ గ్రూప్ ను జాతీయం చేస్తుందన్న వదంతలు ఇన్వెస్టర్లను కలవరపరచింది. దాంతో సిటీ గ్రూప్ షేర్లను ఇన్వెస్టర్లు పిచ్చెక్కినట్లుగా వదిలించుకున్నారు. ఒకరోజు క్రితం సిటీ గ్రూప్ ఆస్తుల విలువ 67,994 కోట్ల రూపాయలుగా అంటే ఎస్ బిఐ కంటే 700 కోట్ల రూపాయలు అధికంగా ఉండేది. గత నాలుగు త్రైమాసికాలుగా సిటీ గ్రూప్ సంస్థ 2,30,485 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఎస్ బిఐ సంపాదన కంటే ఇంది 11 రెట్లు ఎక్కువ. అయితే లాభాల లెక్కల్లో సిటీ గ్రూప్ కు 83,474 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అదే సమయంలో ఎస్ బిఐకి 8,262 కోట్ల రూపాయల లాభం వచ్చింది. గత ఏడాది కాలంలో సిటీ గ్రూప్ ఆస్తుల విలువ 90 శాతానికి పడిపోయింది.
ఆర్ధిక సంక్షోభంతో సిటీ గ్రూపు దివాళా అంచుకు చేరుకుంది. వందలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని పొందుతున్న సిటీ గ్రూప్ ను ప్రస్తుతం 'జోంబి బ్యాంక్'అని నిపుణులు పిలుస్తారు. సిటీ గ్రూప్ భవిష్యత్ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ బ్యాంకు బాగుపడుతుందన్న ఆశలు లేవని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జార్జి బుష్, హెన్రీ పాల్సన్ లు విడుదల చేసిన 700 బిలియన్ల బెయిల్ ఔట్ ప్యాకేజిలో 45 బిలియన్ల డాలర్లు (2,25,000 కోట్ల రూపాయలు) సిటీ బ్యాంకుకు ఆర్ధిక సహాయంగా అందుతోంది. దాంతోపాటు తన ఆస్తుల గ్యారంటీ పై మరో 301 బిలియన్ డాలర్లను సైతం ప్రబుత్వం నుండి సిటీ గ్రూపు స్వీకరిస్తోంది. అమెరికాలోని 12 అతిపెద్ద బ్యాంకుల పరిస్థితిని అంచనా వేసి ఆర్థిక విశ్లేషకుడు మార్టిన్ హచ్ సన్ సిటీ గ్రూపును జోంబి బ్యాంకుగా వ్యాఖ్యానించారు.
News Posted: 22 February, 2009
|