బొక్కసానికి కోట్లలో గండి
న్యూఢిల్లీ: ఆర్ధిక సంక్షోభ పరిష్కార ఎత్తుగడల్లో భాగంగా ప్రభుత్వం మూడో విడత ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించింది. ఎక్సైజ్ సుంకం, సర్వీసు టాక్స్ లను 2 శాతం తగ్గించే రూపంలో కేంద్రం ఈ ప్యాకేజిని ప్రకటించింది. పన్నుల తగ్గింపు వలన ప్రభుత్వ ఆదాయానికి 28 వేల కోట్ల రూపాయల గండి పడనున్నట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు ప్రకటించింది.
'పన్నుల తగ్గింపు చర్యల వలన సర్వీస్ టాక్స్ రాబడిలో 13వేల కోట్ల రూపాయలు, ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపులో 8,500 కోట్ల రూపాయలు, కస్టమ్స్ డ్యూటీ ఆదాయంలో 6,600 కోట్ల రూపాయలు గండిపడుతుంది.' సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చైర్మన్ పిసి ఝా మీడియాకు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి నుండి ఈ పన్నుల తగ్గింపు చర్యలు అమలులోకి వస్తాయని ఝా తెలిపారు.ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్ లపై 2 శాతం తగ్గింపు, నాలుగు శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు పథకం మార్చ 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ప్రకటించారు. ఎక్సైజ్ డ్యూటీలో 2 శాతం మినహాయింపు 10 శాతంగా ఉండే శ్లాబ్ల్ కు మాత్రమే వర్తిస్తుందని ఝా తెలిపారు. దాంతోపాటు విద్యుత్ ఉత్పత్తి కోసం జరిగే నాఫ్తా దిగుమతులపై ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు వచ్చే ఆర్ధిక సంవత్సరం వరకు కొనసాగుతుందని ముఖర్జీ తెలిపారు.
News Posted: 24 February, 2009
|