డీజిల్ ధర తగ్గింపు?
న్యూఢిల్లీ: ఢీజిల్ ధరపై మరో రెండు రూపాయల్ని ప్రభుత్వం రెండు రోజుల్లో తగ్గించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఉపా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పెట్రోల్ ధర మాత్రం స్థిరంగా ఉంటుంది. డిసెంబర్ నుండి ఎన్నికల ప్రకటన లోపు డీజిల్ ధరపై విడతకు రెండు రూపాయల చొప్పును రెండు విడతల్లో నాలుగు రూపాయలు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ విషయంపై కేబినెట్ రెండు రోజుల్లో మరోసారి సమావేశం కానుందని ఆ అధికారి తెలిపారు.
డీజిల్ తగ్గింపుతో ద్రవ్యోల్బణం మరింత తగ్గిపోతుంది. అదే సమయంలో పళ్లు, కూరగాయలు, పలు సరకుల రవాణా చార్జీలు తగ్గడంతో అవి ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి. పెట్రోల్ ధరపై ఇప్పటికే రెండు విడతలుగా 10 రూపాయల్ని ప్రభుత్వం తగ్గించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియమ్, హిందుస్తాన్ పెట్రోలియం ప్రభుత్వ రంగ ఆయిల్ కంపనీలు లీటరు పెట్రోలును ఇప్పటికే బొటాబొటి లాభానికి అమ్ముకుంటున్నాయి. అయితే ఆ కంపెనీలకు లీటర్ డీజిల్ ధరపై 3.26 రూపాయలు లాభాలు వస్తున్నాయి. దాంతో డీజిల్ ధరపై రెండు రూపాయలు తగ్గించేందుకు అవకాశముంది. లీటరు పెట్రల్ పై 0.08 రూపాయల లాభం వస్తోంది. డీజిల్ అమ్మకాలపై ఈ కంపెనీలకు రోజుకు 36 కోట్ల లాభం రావడంతో, కిరోసిన్ పై వస్తున్న రోజుకు 24 కోట్ల నష్టం, వంట గ్యాస్ పై వస్తున్న రోజుకు 9 కోట్ల నష్టాలను పూడ్చుకునే వీలుంటుంది. కిరోసిన్ పై లీటరుకు 11.70 రూపాయలు, వంట గ్యాస్ పై సిలిండర్ కు 77.51 రూపాయల నష్టాన్ని ఈ కంపెనీలు భరిస్తున్నాయి.
News Posted: 25 February, 2009
|