మార్చి 23న నానో రిలీజ్
న్యూఢిల్లీ: అత్యంత చౌకైన ఆటోమొబైల్ అద్భుతంగా నిలిచిన 'నానో' ప్రజా కార్లు మార్చి 23న ముంబై మార్కెట్ లోకి వస్తున్నాయి. అయితే బుకింగులు ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్నట్లు టాటా మోటార్స్ గురువారంనాడు ప్రకటించింది. 2008 న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్ప్ పోలో ప్రతిష్టాత్మకమైన టాటా నానో కారు మాతృక తొలిసారిగా వెలుగు చూసింది. అయితే ఈ ఏడాది మార్చి 23న ముంబైలో టాటా నానో కారు వాణిజ్యపరంగా విడుదల కానుంది.
'2009 ఏప్రిల్ నుండి టాటా మోటార్స్ డీలర్ల షోరూముల్లో నానో కార్లు దర్శనమిస్తాయి. 2009 ఏప్రిల్ రెండవ వారం నుండి బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి.'అని కంపెనీ ప్రకటన వెల్లడించింది. టాటా ఒక లక్ష రూపాయల నానో కార్ల బుకింగ్ విధివిధానాలు, ఇతరత్రా వివరాలు వాణిజ్యపరమైన విడుదల సందర్బంగా కంపెనీ ప్రకటించనుంది. దేశ వ్యాప్తంగా బుకింగ్ చేసుకోగల అవకాశాల కోసం టాటా మోటార్స్ పలు ఏర్పాట్లు చేస్తోంది. నానో పట్ల ఆసక్తి ఉన్నవారు వారి వారి ప్రాంతాల్లోనే నానో బుకింగ్ చేసుకునేందుకు వీలవుతుందని ఆ ప్రకటన తెలిపింది. నిరుడు జరిగిన జెనీవా మోటార్ షోలో కూడా టాటా మోటార్స్ సంస్థ నానో కారును ప్రదర్శించింది. నిస్సాన్-రెనాల్ట్ సంస్థ కూడా చౌకైన కుటుంబ కార్లను రూపొందిస్తున్నట్లు ప్రకటించడంతో చౌక కార్ల మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది. అయితే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఈ ప్రణాకల్ని అటకెక్కించేట్లు చేసింది.
News Posted: 26 February, 2009
|