త్వరలో నోకియా లాప్ టాప్
హెల్సింకి: ప్రపంచ ప్రఖ్యాత సెల్ ఫోన్ సంస్థ నోకియా లాప్ టాప్ ఉత్పత్తి రంగంలోకి కొత్తగా ప్రవేశించనుందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒల్లి-పెక్క కల్లాస్వో తెలిపారు. ఫిన్ ల్యాండ్ నేషనల్ బ్రాడ్ కాస్టర్ వైఎల్ఈ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ-'లాప్ టాప్ ల తయారీ రంగంలోకి అడుగు పెట్టేందుకు మేము చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము' అని ఆయన తెలిపారు.
గత కొంత కాలంగా కంప్యూటర్ల ఉత్పత్తి రంగంలోకి నోకియా సంస్థ ప్రవేశించనుందన్న వదంతులు పరిశ్రలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వదంతులను కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తన ఇంటర్వ్యూలో తొలిసారిగా తేల్చి చెప్పారు. 'సెల్ ఫోన్లకు, పిసిలకు మధ్య తేడా వేగంగా తొలగిపోతోంది. అయిదేళ్ల కాలం లోపే ఆ రెండు సాధనాలు క్రమంగా విలీనమై పోయే అవకాశముంది. ఈనాడు కోట్లాది మంది ప్రజలు సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ అనుభవాన్ని పొందగల్గారు'అని కల్లాస్వో తెలిపారు.
పిసి ఉత్పత్తి రంగంలో మూడవ స్థానంలో ఉన్న ఏసర్ కంపెనీ సెల్ ఫోన్ల వ్యాపారంలోకి దిగిన వారం తర్వాత నోకియా ప్రకటన వెలువడింది. ఏసర్ కంపెనీ ఎనిమిది సెల్ ఫోన్ మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఏసర్ కంపెనీ హ్యూలెట్ పాకార్డ్, లెనోవోలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. కంప్యూటర్ పరిశ్రమలో లాభాల రేటు తక్కువగా ఉంది. దాంతో పలు పిసి బ్రాండ్లు అధి లాభాల రేటున్న హై ఎండ్ సెల్ ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాయి. అదే విధంగా నెట్ వర్క్ ఆపరేటర్లందరూ తమ సర్వీసులకు నోట్ బుక్స్, నెట్ బుక్స్ సౌకర్యాలను జత చేస్తున్నారు. అందువల్ల నోకియా పిసిల ప్రపంచంలోకి అడుగు పెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు. పిసి ఉత్పత్తి రంగంలో కూడా ఆర్ధిక మాంద్యంపు ఛాయలు అలుముకున్నాయి.
News Posted: 27 February, 2009
|