సోషలిజం వైపునకు యుఎస్
(ఎస్సెస్వీ)
హైదరాబాద్ : కరడుగట్టిన కేపిటలిస్టు దేశం, సోషలిజం వాసనలు అసలే గిట్టని అమెరికా ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి తనను తాను రక్షించుకునేందుకు సోషలిజం వైపునకు తొలి అడుగు వేసింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిన సిటీ బ్యాంకును ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం ఎట్టకేలకు తన కేపిటలిస్టు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చింది. అందులో భాగంగానే 25 బిలియన్ డాలర్లు చెల్లించి సిటీ గ్రూప్ లో 36 శాతం వాటా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గత శుక్రవారం నాడు ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు ప్రకటించారు.
లెహ్ మాన్ బ్రదర్స్ పతనం తరువాత సిటీ గ్రూప్ కు అమెరికా ప్రభుత్వం సహాయం అందించడం ఇది మూడవసారి. సిటీ బ్యాంకు కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకమూ కలగకుండా, నష్టాలను ఎదుర్కొనే దిశగా, మూలధనం పెంచుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. దీనితో బ్యాంకు యాజమాన్యం వాటా 26 శాతానికి పడిపోతుంది. అంతేగాక సిటీ గ్రూప్ తన షేర్లపైన ఇంతవరకూ ఉన్న అన్ని డివిడెండ్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏదేమైనా 'బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు' అవుతాయనే సామెత అమెరికా విషయంలోనూ నిజం చేసి చూపించింది ఈ ఆర్థిక సంక్షోభం.
News Posted: 3 March, 2009
|