కుప్పకూలిన సెన్సెక్స్
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మంగళవారంనాడు భారీగా నష్టపోయాయి. ఆ క్రమంలోనే భారత స్టాక్ మార్కెట్లు కూడా బాగా కుంగి పోయాయి. ఫ్రంట్లైన్ స్టాక్స్ లో లాభాల్ని ఆర్జించిన ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీగా నష్టపోయారు. లాభాలతో పార్రంభమైన యూరోపియన్ మార్కెట్లు సైతం బాగా దెబ్బతిన్నాయి. ప్రపంచ సంక్షోభం మరింత ముదురుతోందన్న భయాలు స్టాక్ మార్కెట్లను కుంగదీశాయి.
బిఎస్ఈ సెన్సెక్స్ 195.78 పాయింట్లు కోల్పోయి, 2008 నవంబర్ 20 నాటి స్థాయికి 8411.30 పాయింట్ల వద్దకు చేరింది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ నిఫ్టీ ఇండెక్స 55.55 పాయింట్లు క్షీణించి 2,619.05 పాయింట్లకు చేరింది. 2008 అక్టోబర్ 27 నాటి అత్యల్ప స్థితికి నిఫ్టీ చేరింది.బిఎస్ఈ మిడ్ కేప్ ఇండెక్స 1.72 శాతం క్షీణించగా, స్మాల్ కేప్ ఇండెక్స్ 1.31 శాతం క్షీణించింది. మార్కెట్ బ్రెడ్త్ ప్రతికూలంగా సాగింది. 1,853 షేర్లు క్షీణించగా, 823 షేర్లు లాభించాయి.విదేశీ మదుపులు తరలిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీని ప్రభావం విదేశీ మారక ద్రవ్య లావాదేవీలపై పడింది. దాంతో డాలరుతో రూపాయి మారకం మరింత ఘోరంగా తయారైంది. డాలరుకు 52-09 రూపాయల స్థాయికి రూపాయి విలువ దిగజారింది. అమెరికా ట్రజరీ బాండ్స్ సురక్షితమని అమెరికన్ ఇన్వెస్టర్లు భావించడంతో భారత స్టాక్ మార్కెట్ మదుపులు యుఎస్ కు తరలిపోయాయి. పర్యవసానంగా స్టాక్ మార్కెట్ల పతనం, రూపాయి పతనం జరిగిందని నిపుణుల అంచనా.
News Posted: 3 March, 2009
|