'సత్యం' రేసులో ఐబిఎమ్
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ కొనుగోలు పోటీలో ప్రముఖ గ్లోబల్ ఐటి దిగ్గజం ఐబిఎమ్ ముందు పీఠిన నిలిచింది. ఫిబ్రవరిలో న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ కు సమర్పించిన ఐబిఎమ్ నివేదికలో సత్యం కంప్యూటర్ సొల్యూషన్స్ సంస్థ తన ప్రధాన పోటీదారుగా పేర్కొనడం విశేషం. ప్రముఖ అమెరికా కంపెనీ ఐబిఎమ్ సత్యంలో ప్రధాన వాటాను పొందేందుకు ప్రభుత్వం నియమించిన సత్యం బోర్డుతో సంప్రదింపులు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అందుకోసం అమెరికా, యూరప్ ల నుండి కొంతమంది ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లను, లాయర్ల బృందాన్ని సత్యం లావాదేవీలోని లోతు పాతులను, ఇబ్బందులను అధ్యయనం చేసేందుకు నియమించింది. సత్యం సంస్థ ప్రధాన ఖాతాదారులు తీసుకుంటున్న జాగ్రత్తల పై కూడా ఐబిఎమ్ కంపెనీ దృష్టి సారించింది.
సత్యం కంపెనీ నిర్వహించే బహిరంగ వేలం కేవలం భారతీయులకు మాత్రమే పరిమితం కాదని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పిసి గుప్త వారం క్రితం ప్రకటించారు. డిసెంబర్ 16 సత్యం బోర్డు సమావేశంలో ఐబిఎమ్ సంస్థను ఒక శత్రుపూరితమైన పోటీదారుడుగా సంస్థ మాజీ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. సత్యం సంస్థ కొనుగోలు రేసులో లార్సన్ అండ్ టూబ్రో, బికె మోడి 'స్పైస్ గ్రూప్'లు ఉన్నాయి. ఎల్ అండ్ టి సంస్థకు సత్యం సంస్థలో దాదాపు 12 శాతం వాటా కూడా ఉంది. కంపెనీలో 31 శాతం వాటా పెట్టేందుకు బహిరంగ వేలాన్ని బోర్డు నిర్వహిస్తోంది. బహిరంగ వేలంలో అదనపు అధీకృత 20 శాతం వాటా లభించక పోయినప్పటికీ, ఆ విజేతకు 51 శాతం దాకా వాటా దక్కే అవకాశముంది.
'పుకార్లపైన, ఊహాగానాలపైన ఐబిఎమ్ వ్యాక్యానించదు'అని ఐబిఎమ్ ప్రతినిధి తెలిపారు. ఈ రేసులో ఐబిఎమ్ విజేతగా నిలిచినట్లయితే రెండు సంస్థల ఉద్యోగుల కలుపుకుని 1.25 లక్షల మంది సిబ్బందితో భారత ఐటి రంగంలోనే ఐబిఎమ్ అగ్రగామి సంస్థగా నిలుస్తుంది. ఉమ్మడి కంపెనీలో టిసిఎస్ కంపెనీ కంటె ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారు.ఈ కొనుగోలు ఐబిఎమ్ కు చాలా లాభం చేకూరుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సత్యం కంపెనీకి అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. భారత ఐటి సర్వీసు ప్రొవైడర్లతో పోటీ పడేందుకు ఈ చర్య ఐబిఎమ్ కు ఉపకరిస్తుంది. బిడ్డర్స్ కనీస విలువ 2వేల కోట్ల రూపాయలకు పై చిలుకు ఉంటుంది. సత్యం డాక్యుమెంట్లను ప్రభుత్వం, రెగ్యులేటర్లు ఆమోదించిన తర్వాత వేలం ప్యాకేజీని అర్హులైన కొనుగోలుదార్లకు అందజేస్తారు.
News Posted: 5 March, 2009
|