ఈ కార్ల జోరు తగ్గలేదు
న్యూఢిల్లీ: ఆర్ధిక సంక్షోభం కారణంగా ప్రపంచ ఆటోమొబైల్ రంగం చతికిలబడింది. అయినప్పటికి సిఫ్ట్, టాటా ఇండిగో కాంపాక్ట్ సెడాన్ (సిఎస్), మహీంద్ర బొలెరొ, రాయల్ ఎన్ ఫీల్డ్ ల కోసం కొనుగోలుదార్లు వేచి ఉండవలసి వస్తోంది. ఆర్ధిక సంక్షోభ ప్రతికూల పవనంలోనూ ఈ వాహనాల డిమాండ్ ఊపందుకోవడం విశేషం. ఆటోమొబైల్ రిటైల్ షోరూంలన్నీ బేరాలు లేక బోసిపోయి ఉన్న తరుణంలో ఈ వాహనాలకు వినియోగదారుల వెయిటింగ్ లిస్టులు తయారైనాయి. స్విఫ్ట్, ఇండిగోలు గత ఏడాది సిఎస్ మార్కెట్ లోకి విడుదలైనప్పటి నుండి వెయిటింగ్ లిస్టులు కొనసాగుతున్నాయి. ఈ రెండు కార్లకు తోడు బోలెరో, రాయల్ ఎన్ ఫీల్డ్ లకు ఆకస్మికంగా డిమాండ్ పెరిగింది. మరోవైపు దేశీయ ఆటోమొబైల్ అమ్మకాల మార్కెట్ 0.43 శాతం క్షీణించింది.
డిమాండ్ పెరగడంతో మారుతి కంపెనీ స్పిఫ్ట్ కార్ల ఉత్పత్తిని పెంచింది. అదే విధంగా సెడాన్లలో ఏకైక అతి చిన్న కారు ఇండిగో ఎస్ కి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. చిన్న కార్లపై ఎక్సైజ్ డ్యూటీ 8 శాతంగా ఉంటే, పెద్ద కార్ల పై 20 శాతం ఎక్సైజ్ డ్యూటీని చెల్లించవలసి ఉంటుంది. టాటా ఇండిగో సిఎస్ కారు కోసం చాలా మార్కెట్లలో మూడు వారాల పాటు వేచి ఉండాల్సి ఉంది. భారత దేశపు అతి పెద్ద బహుళ ప్రయోజన వాహనం బోలెరో అమ్మకాలు ఫిబ్రవరిలో అత్యున్నత స్థాయికి చేరాయి. కార్పోరేట్ బుకింగులు కూడా పెరిగాయి. ఎన్నికల కారణంగా బొలెరొ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం రాయల్ ఎన్ ఫీల్డ్ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. భారత గడ్డపై 350 సిసి బైక్ ల్ని కొనుగోలు చేయడం సర్వసాధారణం. అయితే థండర్ బర్డ్ ట్విన్ స్పార్క్, 500 సిసి మాషిమో కొత్త మొడల్స్ పై కూడా కస్టమర్లు మోజు పడుతున్నారు. సాధారణంగా ఎన్ఫీల్డ్ వాహనాన్ని మధ్య వయస్కులు కొంటుంటారు. అయితే ప్రస్తుతం ఎన్ ఫీల్డ్ కొనుగోలు దారుల సగటు వయసు 25 సంవత్సరాలకు పడిపోయింది.
News Posted: 6 March, 2009
|