హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కు చెందిన 51 శాతం వాటాల అమ్మకానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్ కోసం గ్లోబల్ బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించమని సత్యం కంప్యూటర్స్ సంస్థకు సెబీ శుక్రవారంనాడు అనుమతులను జారీ చేసింది. ఎంపిక చేసిన ఇన్వెస్టర్ కు తాజాగా 31 శాతం ఈక్విటీని కంపెనీ జారీచేస్తుంది. ఆ తర్వాత బహిరంగ మార్కెట్ లో కనీసం 20 శాతం కంపెనీ షేర్లను ఆ ఇన్వెస్టర్ తప్పనిసరిగా కొనుగోలు చేయవలసి ఉంటుంది.
సబ్ స్క్రిప్షన్ కోసం ఇన్వెస్టర్ ప్రతిపాదించిన షేరు ధరనే బహిరంగ మార్కెట్ లో కూడా ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది. అయితే ఒక వేళ 51 శాతం వాటా వచ్చే విధంగా ఇన్వెస్టర్ బహిరంగ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేయలేని పక్షంలో మిగిలిన షేర్లను సత్యం సంస్థే ఇన్వెస్టర్ కు కేటాయిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇన్వెస్టర్ కొనుగోలు చేసిన ఈ ఈక్విటీ షేర్లను మూడేళ్లపాటు అమ్ముకునే అవకాశముండదు.